Power War in Assembly 2024 : శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా విద్యుత్ అంశం అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని విమర్శించారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పుడో పక్కన పడేసిన పాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారన్న రాజగోపాల్‌రెడ్డి, ఆ ప్రాజెక్టు నిత్యం ఏదోరీతిలో షట్‌డౌన్ అవుతుందని తెలిపారు.
కేసీఆర్ రాకపోవడం దురదృష్టకరం :థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇష్టారీతిన అంచనాలు పెంచి బీహెచ్ఈఎల్కు రూ, 20 వేలకోట్లు విలువైన పనులు నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారని ఆరోపించారు. విద్యుత్ రంగంపై న్యాయ విచారణ జరుగుతోందన్న ఆయన, బాధ్యులకు శిక్ష తప్పదని స్పష్టంచేశారు. కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడం దురదృష్టకరమన్నారు.
తప్పుదోవ పట్టిస్తున్నారు :అధికారపక్షం చేసిన ఆరోపణల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఖండించారు. విద్యుత్ మీటర్లపై ముఖ్యమంత్రి, సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని మండిపడ్డారు. పదేళ్లలో విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఓ బూచిలా చూపే యత్నం చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
"ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమంత్రి, సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం రంగ సంస్థలతో జరిగే ఒప్పందాలలో అవినీతి ఏముంటుందో తెలపాలి. పదేళ్లలో విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చెప్పాలి". - జగదీశ్‌రెడ్డి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి