Minister Satyakumar Yadav on HMPV Cases in AP:దేశంలోకి హెచ్ఎంపీవీ వ్యాప్తి కలకలం రేపిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎలాంటి హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై అక్కడి వైద్య ఆరోగ్య శాఖల కార్యదర్శులతో మాట్లాడి తెలుసుకోవాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబును మంత్రి ఆదేశించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు విశాఖ వెళ్లిన మంత్రి అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 10 ఐసీఎంఆర్, 9 వీడీఆర్ ఎల్ ల్యాబ్లను సన్నద్ధం చేయాల్సిందిగా మంత్రి సూచించారు. అవసరాన్నిబట్టి టెస్టులకు కావాల్సిన కిట్లు, యాంటీ వైరల్ మందుల లభ్యతపై అంచనాలు తయారు చేయాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. పరిస్థితిని బట్టి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచనలు ఇచ్చారు.