తెలంగాణ

telangana

ETV Bharat / state

అది శ్వేతపత్రం కాదు, ఫాల్స్‌ పేపర్‌ - గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే : హరీశ్‌రావు - సాగునీటిరంగం శ్వేతపత్రం హరీశ్ ఫైర్

HarishRao Fires White Paper on Irrigation Projects : శ్వేతపత్రం తప్పుల తడక అని చెప్పేందుకు రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని లేవనెత్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అందులోని తప్పులతడకలు చదివి ప్రజలకు వివరిస్తానని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది వైట్‌ పేపర్‌ కాదని, ఫాల్స్‌ పేపర్‌ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫాల్స్‌ పేపర్‌ ప్రవేశపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao
Harish Rao

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 12:56 PM IST

Updated : Feb 17, 2024, 3:40 PM IST

HarishRao Fires White Paper on Irrigation Projects : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అన్నీ అసత్యాలే చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఎన్ని గంటలైనా చర్చిద్దామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని సభా నాయకుడు చెప్పారని అన్నారు. కానీ ఇంత మంచి విషయం 30 నిమిషాల్లో చెప్పడం సాధ్యం కాదని, కనీసం తనకు 2 గంటలైనా సమయం కేటాయించాలని చెప్పారు. అసెంబ్లీలో నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం చర్చపై ఆయన మాట్లాడారు.

'నేను మాట్లాడుతున్నప్పుడు మంత్రులు నోట్‌ చేసుకోవాలి. నేను మాట్లాడిన తర్వాత మంత్రులు స్పందించవచ్చు. నేను మాట్లాడినపుడు మధ్యలో మాట్లాడితే విషయం పక్కదారి పడుతుంది. గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారు. శ్వేతపత్రాన్ని ఇప్పుడే ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో 4 సత్యదూరమైన అంశాలు గుర్తించా. మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయన్నది అసత్యం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసిందే మేము' అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

ఆ వార్తలు తప్పయితే రేవంత్ సర్కార్ వివరణ ఎందుకివ్వలేదు?: హరీశ్‌రావు

Telangana Assembly Sessions 2024 : మధ్యమానేరు సమైక్య రాష్ట్రంలో పూర్తి చేసిన అంశం నిజమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు (Harishrao) సవాల్ విసిరారు. శ్వేతపత్రంలో పేర్కొన్న ఖర్చులు, ఆయకట్టు అంశాలు రెండుచోట్ల రెండు రకాలుగా చెప్పారని ఆరోపించారు. రూ.54,239 కోట్లు ఖర్చు పెట్టి 57.79 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని ఒకచోట చెప్పారని, మరోచోట రూ.54,234 కోట్లు ఖర్చు చేసి 41.76 లక్షల ఎకరాలకు నీరందించినట్లు చెప్పినట్లు హరీశ్‌రావు వివరించారు.

"రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు మా ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదనేది పచ్చి అబద్ధం. ప్రభుత్వం చట్టసభల్లో ఇలాంటి అసత్యాలతో పత్రాలు సభలో పెట్టడం సరికాదు. రాయలసీమ ఎత్తిపోతలపై 2020 మే 5న జీవో వచ్చింది. జీవో రాకముందే పత్రికల్లో వార్త ఆధారంగా 2020 జనవరి 29న కేంద్రానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే మే 12న కేంద్రం, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశాం. మేం ఫిర్యాదు చేసిన లేఖలు కావాలంటే ప్రభుత్వానికి పంపుతాం." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

HarishRao Comments on Congress : తమ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని శ్వేతపత్రంలో (White Paper on Irrigation Projects) చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ తాము వారంలోపే కేంద్రానికి ఫిర్యాదు చేశామని, గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చామని గుర్తుచేశారు. శ్వేతపత్రం తప్పుల తడక అని చెప్పేందుకు రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని లేవనెత్తినట్లు చెప్పారు. అందులోని తప్పులతడకలు చదివి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది వైట్‌ పేపర్‌ కాదని ఫాల్స్‌ పేపర్‌ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

నాడు ప్రచారంలో అబద్ధాలు - నేడు పాలనలో అసహనం : హరీశ్‌రావు

"ఫాల్స్‌ పేపర్‌ ప్రవేశపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం. ఎన్నికల సభల్లో చేసినట్లే శాసనసభలోనే గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. పదేపదే అబద్ధాలు చెప్పి అదే నిజమనే భ్రమ ప్రజలకు కల్పిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2024 జనవరి 17న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మినిట్స్‌ విడుదల చేసింది. సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను నెలలోపు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని ఈ ప్రభుత్వం దిల్లీకి వెళ్లి ఒప్పుకుంది." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి (KRMB) అప్పగించడాన్నితాము వ్యతిరేకించామని హరీశ్‌రావు వివరించారు. మీడియా ద్వారా పత్రికల్లో వార్తల ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీశామని చెప్పారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని, కానీ ప్రభుత్వం మాత్రం మేము ఒప్పుకున్నట్లు పదేపదే అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు. కృష్ణా జలాల్లో 68 శాతం వాటా కోసం డిమాండ్‌ చేయలేదని మంత్రి అన్నారని వివరించారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటాకు అడిగినట్లు మంత్రి చెప్పారని, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని లేఖ రాశారని ఆరోపించారు. సభలో తమకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని, తమ వాదన ఒక వైపు మాత్రమే ప్రజల్లోకి వెళ్తోందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

ప్రాణహిత-చేవెళ్లకు 8ఏళ్లలో ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదు

ప్రాణాహిత-చేవెళ్ల వ్యయం రూ.17,825 కోట్లు మంజూరు చేశారు. ప్రాణాహిత-చేవెళ్ల వ్యయం ఏడాదిలోపే రూ.38,500 కోట్లకు పెంచారు. నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టుకు మొబిలైజేషన్‌, సర్వేల పేరుతో వ్యయం చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు 8ఏళ్లలో ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చాలనుకోలేదు. అనుమతుల కోసం అన్ని రకాల ప్రయత్నం చేశాం. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్రానికి కేసీఆర్‌ లేఖ రాశారు. ప్రాణహిత-చేవెళ్లకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఆరోజు కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది కేంద్రమే. తుమ్మిడిహట్టికి అగ్రిమెంట్‌ చేయని మీరు మమ్మల్ని తప్పుపడతారా?. అధికారంలో ఉన్నది మీరే మేమేదైనా తప్పులు చేస్తే చర్యలు తీసుకోండి. - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్​ఎస్ ముందుకు తీసుకెళ్లింది : కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.2700 కోట్లు ఖర్చు పెట్టామని, ఈ ప్రాజెక్టు చేపట్టిన 30 ఏళ్ల తర్వాత 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్​రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టును తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసి 3.07 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చామని తెలిపారు. నెట్టెంపాడుకు రూ.1,730 కోట్లు ఖర్చు పెట్టి 2,300 ఎకరాలకు నీళ్లు ఇచ్చారన్నారు. నెట్టెంపాడు పెండింగ్ పనులు పూర్తిచేసి 1.39 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని, అలాగే బీమా ప్రాజెక్టుకు రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టి 12 వేల ఎకరాలకు నీళ్లు అందించామని ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు.

"కాళేశ్వరం ప్రాజెక్టు 152 మీటర్ల వద్ద నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. అందుకు ప్రత్యామ్నాయం చూపాలని కేంద్ర ప్రభుత్వం సంస్థ వ్యాప్కోస్​ను కోరాము. ఆ సంస్థ సూచన మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణం చేపట్టాము. ఈ సీఎం చర్యలు చూస్తుంటే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నారు. బ్యారేజ్‌ కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. తప్పులు జరిగితే విచారణ చేయండి, తప్పు ఎవరు చేసినా తప్పే. బ్యారేజ్‌ కూలిపోవాలని ఎవరూ ఆశించరు. బ్యారేజ్‌ను త్వరగా పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. కాళేశ్వరం కింద అనేక రిజర్వాయర్లు, కాలువలు నిర్మించాం. కాంగ్రెస్‌ హయాంలో దేవాదుల ఎత్తిపోతల చేపడితే పైపులు పటాకుల్లా పేలాయి. వైఎస్‌ఆర్‌ హయాంలో పంజాగుట్ట పైవంతెన నిర్మాణ సమయంలో కూలి చాలా మంది చనిపోయారు. దేవాదుల ఫేజ్‌-3 టన్నెల్‌ కూలి ముగ్గురు చనిపోయారు. తాలిపేరు, సింగూరు డ్యామ్‌ గేట్లు కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు దురదృష్టకరం, విచారణ జరపాలి."- హరీశ్​రావు, బీఆర్​ఎస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్​ఎస్ ముందుకు తీసుకెళ్లింది హరీశ్​రావు

''కాళేశ్వరం' అంత అవినీతి ఎప్పుడూ జరగలేదు - అందుకే వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయింది'

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే నీటి ప్రాజెక్టులు అప్పగించారు : హరీశ్‌రావు

Last Updated : Feb 17, 2024, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details