Harish Rao Comments on Six Guarantees :తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని మాజీమంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎర్రవల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, ఎన్నికల కోడ్‌తో తప్పించుకోవద్దని హరీశ్‌రావు(Harish Rao) పేర్కొన్నారు.
ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడదాం - త్వరలోనే ప్రజల్లోకి వస్తాను : కేసీఆర్
BRS Parliamentary Party Meeting :ఎన్నికల కోడ్ రాకముందే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ, రూ.4000 పెన్షన్, వడ్లకు బోనస్ ఎన్నికల కోడ్‌లోపే ఇవ్వాలని కోరారు. కృష్ణా బోర్డు(Krishna Board)కు ప్రాజెక్టుల స్వాధీనం సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, బీసీ జనగణన తదితర అంశాలపై ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు హరీశ్‌రావు తెలిపారు.
వివిధ అంశాలపై ఆయా శాఖల మంత్రులను ఎంపీలు కలవాలని నిర్ణయించారు. కృష్ణా ప్రాజెక్టుల విషయమై పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ఎంపీలకు కేసీఆర్(KCR) స్పష్టం చేసినట్లు తెలిపారు. గత పదేళ్లుగా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పజెప్పకుండా చాలా విషయాలపై తాము స్పష్టత అడిగామని, స్పష్టత లేకుండా ప్రాజెక్టులు అప్పగించబోమని మేం గతంలో తెలిపామని అన్నారు.