Handwriting for 10th Inter Students : చక్కని చేతిరాత విద్యార్థుల భవితకు చాలా తోడ్పాటునిస్తుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మార్కుల సాధనకు మంచి చేతిరాత దోహదం చేస్తుంది. మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు ఎక్కువ మార్కుల రావాలని, చేతిరాత పట్ల కొంత ఆందోళన ఉంటుంది. దీనిని అధిగమించేందుకు చేతిరాతను సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి రాసింది, వందసార్లు చదివిన దానితో సమానం అంటుంటారు ఇంట్లోని పెద్దవారు. కాబట్టి రాస్తూ చదవడం వల్ల విద్యార్థులకు ఏకకాలంలో రెండు ప్రయోజనాలు సులభంగా చేకూరుతాయి. వచ్చే నెల మార్చిలో జరగనున్న పది, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక కథనం.
మార్గదర్శకాలివే
- ఆన్సర్ షీట్లో పేజీ పైభాగంలో, ఎడమ వైపున అంగుళం చొప్పున, కుడి వైపున అర అంగుళం చొప్పున మార్జిన్ వదిలి పెట్టాలి.
- స్కెచ్ పెన్నులు, ఇతర అచ్చులు పడే దట్టమైన సిరా ఉండే పెన్నులు వాడకూడదు. అలాంటివి వాడకుండా సాధారణ బాల్ పాయింట్ పెన్నులు వినియోగిస్తే రాసిన పదాలు అందంగా కనిపిస్తాయి.
- కొట్టివేతలు లేకుండా పదాల మధ్య దూరాన్ని అవసరమైన నిడివితో వదిలి పెడుతూ సరైన క్రమ పద్ధతిలో రాయాలి.
- గణితంలో అంకెలు మూల్యాంకనం చేసే వ్యక్తికి అర్థమయ్యేలా సంఖ్యలను స్పష్టంగా రాయాలి. లేకుంటే మార్కుల్లో కోత పడే అవకాశం ఉంటుంది.
- విద్యార్థులు తమ చేతిరాతకు అనుకూలంగా ఉండే పెన్నులను వాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
- ముఖ్యాంశాలు, శీర్షికలు, ఉప శీర్షికలు, స్పష్టంగా కనిపించేలా వాటి కింద అండర్‌లైన్ చేయాలి.
- గొలుసు కట్టు రాతలు అనవసరం, అక్షరంపై మరో అక్షరం అస్సలు రాయకూడదు.
- విద్యార్థి కూర్చునే విధానం, పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను ప్రభావం చేస్తుంది.
"అక్షరాలు స్పష్టంగా ఉండేలా రాస్తూ సాధన చేయాలి. పదాల మధ్య తగినంత నిడివి పాటించాలి. చేతిరాత కోసం చూచిరాతలను సాధన చేస్తే క్రమంగా అందమైన రైటింగ్ సొంతం అవుతుంది. ప్రతీనిత్యం పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా కనీసం అరగంట రాయడానికి కేటాయించాలి. కొట్టివేతలు, గొలుసు కట్టు రాత లేకుండా జాగ్రత్త పడాలి" -సూర్యనారాయణ, గ్రాఫాలజిస్ట్