Half day schools in Telangana : ప్రతీ సంవత్సరం మార్చిలో ఒంటి పూట బడులు నిర్వహిస్తారన్న సంగతి మనకు తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా ఒక్క పూట బడుల నిర్వహణకు అంతా సిద్ధమైంది. తెలంగాణలో రేపటి నుంచే (మార్చి 15) కొత్త టైమ్ టేబుల్ అమలు కానుంది. దీని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రంజాన్ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల టైమింగ్ మార్చారు.
మండుతున్న ఎండలు..
ఈ సారి వేసవి చాలా ముందస్తుగానే ప్రారంభమైందని చెప్పాలి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం మొదలయ్యాయి. మార్చి ప్రారంభమైన తర్వాత ఎండలు మరింత ముదిరాయి. దీంతో.. అధిక ఉష్ణోగ్రత్తలతో జనం విలవిల్లాడుతున్నారు. పొద్దున 10 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రోజంతా నాలుగు గోడల మధ్య కూర్చుంటున్న విద్యార్థులు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒంటి పూట బడుల నిర్వహణకు ఆదేశాలిచ్చింది.
మార్చి 15 నుంచి..
తెలంగాణలో మార్చి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 15వ తేదీన మొదల్యయే ఈ ఒంటిపూచ బడులు.. ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగుతాయని ఆదేశాల్లో పేర్కొంది.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో..
దాదాపుగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు కొనసాగుతాయి. కానీ.. ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్న పాఠశాలల్లో మాత్రం టైమింగ్స్ వేరుగా ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సెంటర్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఈ స్కూళ్లలోని విద్యార్థులకు ముందుగా మధ్యాహ్నం భోజనం పెడతారు. ఆ తర్వాత తరగతులు నిర్వహిస్తారు. టెన్త్ పరీక్షలు ముగిసే వరకు ఇలా నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తయిన తర్వాత యథావిధిగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్లో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంజాన్ పండగ నేపథ్యంలో.. పాఠశాలలు, కాలేజీల టైమింగ్స్ మార్చారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మార్చి 12వ తేదీ నుంచే ఈ టైమింగ్స్ అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ టైమింగ్స్ కొనసాగుతాయి. ఒంటి పూట బడులపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.