Gurukul Student Died Due to Illness In Suryapet : సూర్యాపేట జిల్లాలోని దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సరస్వతి అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన సోమయ్య, నవ్య దంపతుల కుమార్తె కొంపల్లి సరస్వతి దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.
సరస్వతీ గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గురుకుల సిబ్దంది తొలుత పెన్పహడ్ ఆర్ఎంపీ డాక్టర్‌కు చూపించారు. విద్యార్థిని అనారోగ్యం విషమించడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విద్యార్థిని అనారోగ్యంతో బాధపడుతున్నా కనీసం పట్టించుకోలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురు ఆరోగ్యంపై కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. సరస్వతి మృతికి గురుకులం సిబ్బంది కారణమని పేర్కొన్నారు.
షాద్ నగర్లో దారుణం - యువతిపై కత్తితో దాడి
విద్యార్థి సంఘాల ఆందోళన : సరస్వతీ మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు చేరుకున్న విద్యార్థి సంఘాలు ఆసుపత్రిలో నిరసనకు దిగాయి. సరస్వతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశాయి. 50 లక్షల నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వసతి గృహాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. సరస్వతి మృతికి సిబ్బందే కారణమంటూ ఆర్సీఓ, ప్రిన్సిపాల్ తదితర సిబ్బందిపై మృతురాలి బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
విద్యార్థిని మృతిపై స్పందించిన మంత్రులు :మరోవైపు సరస్వతి మృతిపై విచారణ జరపాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సరస్వతి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. సరస్వతి ఇంట్లో ఒకరికి బీసీ గురుకుల సొసైటీలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. విద్యార్థిని కుటుంబానికి తక్షణ సాయంగా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు.
తోకతో జన్మించిన బాలుడు - శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు - The Boy With A Tail