ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుంటూరులో ఇద్దరు బలి - ఈ పాపం ఎవరిది? - గుంటూరులో డయోరియా

Pollute Water in Guntur: గుంటూరులో కలుషిత నీరు కారణంగా ఇద్దరు మృతి చెందటం మరో 25 మంది అసుపత్రుల్లో చేరడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. విపక్షాలను, మీడియాను నిందించటం, సమస్యకు కారణాలు చెప్పకుండా దాటవేయటం వల్ల ఉపయోగం లేదన్న విషయం ప్రభుత్వం గుర్తించాలి. గుంటూరు విషాద ఘటన తర్వాత ప్రభుత్వం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? చేయాల్సిన చర్యలేంటి?

Pollute_Water_in_Guntur
Pollute_Water_in_Guntur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 10:52 PM IST

ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుంటూరులో ఇద్దరు బలి - ఈ పాపం ఎవరిది?

Pollute Water in Guntur : గుంటూరు నగరపాలక సంస్థ కేవలం కార్పోరేషన్ మాత్రమే కాదు. ముఖ్యమంత్రి నివాసం ఉండేది గుంటూరు జిల్లాలోనే. రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన రాజధాని కూడా ఈ జిల్లాలోనే ఉంటుంది. ఇలాంటి కీలక ప్రాంతంలో ప్రజల కనీస అవసరాలైన సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోంది. గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడడం గతంలోనే సంచలనమైంది. తర్వాత అయినా యంత్రాంగం గుణ పాఠాలు నేర్వలేదు. గత ప్రభుత్వ హయాంలో పాత గుంటూరు ప్రాంతంలోని పైపులైన్లు మార్చి కొత్తవి వేశారు. అయితే నగరంలో మంచినీరు రంగుమారి వస్తున్న విషయం కొద్దిరోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. నీరు దుర్వాసన వస్తోందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా యంత్రాంగం అప్రమత్తం కాలేదు. సంగడిగుంటకి చెందిన ఓబులు అనే వ్యక్తి అనారోగ్యం పాలై మరణించారు.

మరింతగా పెరిగిన డయేరియా కేసులు- ఆందోళన వద్దంటున్న మంత్రి రజనీ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గుంటూరు తూర్పు టీడీపీ ఇంఛార్జ్‌ నసీర్ కలుషిత నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఈనెల 9, 10 తేదీల్లో 20 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. శారదా కాలనీకి చెందిన పద్మ అనే యువతి జీజీహెచ్​లో చికిత్స పొందుతూ మరణించింది. యువతి ప్రాణం గాల్లో కలిసిన తర్వాత గానీ అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడలేదు. శారదాకాలనీతో పాటు శ్రీనగర్, సంగడిగుంట, అనందపేట, నల్లచెరువు, పొన్నూరు రోడ్ తదితర ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య అధికంగా ఉంది. ఒక్కోసారి తాగునీటిలో పురుగులు కూడా వస్తున్నాయని ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. రంగుమారటంతో పాటు దుర్వాసన వచ్చిన విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోలేదని వారి నిర్లక్ష్యం కారణంగానే పద్మ మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పైపులైన్ల సమస్య - కలుషితమైన నీరు : జరిగిన విషాదంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నగరపాలక సంస్థ యంత్రాంగం వ్యవహరించింది. హడావుడిగా బ్లీచింగ్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కుళాయి నీటి సరఫరా ఆపేసి ట్యాంకర్ల ద్వారా నీరు అందజేశారు. ఇంటింటి సర్వే చేపట్టారు. అయితే నీటి నాణ్యత పరీక్షలు నిరంతరం నిర్వహించటం, పైపులైన్లు పర్యవేక్షణ పకడ్బందీగా చేపట్టడం, కాలం చెల్లిన పైపు లైన్లను ఎప్పటికప్పుడు మార్చటం తప్పనిసరి. ప్రస్తుతం నీటి నాణ్యత పరీక్షలు కేవలం ఫిల్టర్ పాయింట్ వద్ద మాత్రమే జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో కూడా నీటి నాణ్యత పరీక్షలు చేయటానికి ప్రతి సచివాలయం పరిధిలో కిట్లు, సామగ్రి ఉన్నాయి.

గతంలో కమిషనర్ నిశాంత్ కుమార్ వాటితోనే నగర వ్యాప్తంగా నిత్యం 4 వేలకు పైగా నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించేవారు. నెలలో ప్రతి వీధిలో ఉన్న ఇళ్లను రెండు సార్లు తనిఖీ చేసేవారు. ట్యాప్ పాయింట్ వద్దే పరీక్షలు చేయటంతో పైపులైన్ల సమస్య కారణంగా నీరు కలుషితమైనా వెంటనే తెలిసిపోయేది. ప్రస్తుతం ఆ పరీక్షలు మొక్కుబడిగా మారాయి. దీంతో కలుషిత నీరు రావటం పరిపాటిగా మారింది. యువతి మృతి తర్వాత కూడా రిజర్వాయర్ల వద్ద నీటి నాణ్యత పరీక్షలు చేయగా అంతా సక్రమంగానే ఉంది. దీంతో నీటి పంపిణీ లైన్లలోనే ఎక్కడో తేడా ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ప్రాణాలు తీస్తున్న కలుషిత నీరు - ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు

లోపించిన నిశిత పరిశీలన : కాల్వలు, రహదారుల పనులు చేసే ప్రాంతాల్లో పొరపాటున తాగు నీటి పైపులు పగిలి వాటిల్లోకి మురుగునీరు చేరి నీళ్లు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అలాగే డ్రైనేజీల పక్కనే కుళాయి లైన్లు వెళ్లే ప్రాంతాల్లోనూ కాలుష్యానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం నగరంలో ఎక్కడైతే కేసులు వచ్చాయో ఆ ప్రాంతాలన్నిటిలో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణ పనులు జరుగుతున్నా యి. పైపులకు ఎక్కడైనా లీకులు ఉంటే ఈ మట్టి అందులో చేరి నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉంది. నిరంతరం పనులు జరిగే ప్రాంతాలలో తాగునీటి పైపులైన్లపై నిశిత పరిశీలన ఉండాల్సి ఉండగా అది లోపించింది.

ముందుకు రాని గుత్తేదారులు : ఇది గుంటూరు నగరంలోని సమస్య మాత్రమే కాదు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పాడై తుప్పు పట్టిన పైపుల్లో సరఫరా చేస్తున్న తాగు నీరు ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోంది. ఇతర మున్సిపాలిటీలలోని తాగునీటి పైపులైన్లలో చాలా వరకు 4, 5 దశాబ్దాల క్రితం వేసినవే. 25ఏళ్లకో సారి వీటిని మార్చడం ద్వారా కలుషిత నీటి సమస్యను పరిష్కరించొచ్చు. తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అమృత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులివ్వటం లేదు. ఆ నిధులు ఉంటే తుప్పుపట్టిన పైపులైన్లు మార్చే అవకాశం ఉంటుంది. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల పెట్టుబడుల ప్రణాళిక-సీఐఐసీను జగన్ ప్రభుత్వం అటకెక్కించింది.

పాడైన తాగునీటి పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయడం, రహదారులు, కాలువలు మరమ్మతులు చేయడం. ఇతర అత్యవసర పనులకు, ప్రజలకు అదనపు సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యానికి వైఎస్సార్సీపీ సర్కారు తూట్లు పొడిచింది. పుర, నగరపాలక సంస్థల నుంచి బిల్లులు సకాలంలో ఇవ్వని కారణంగా నగరాలు, పట్టణాల్లోనూ పనులు చేయడానికి గుత్తేదారులూ ముందుకు రావడం లేదు. దీంతో ప్రధాన నగరాల్లో పాడైన పాత తాగునీటి పైపులైన్లు కలుషిత నీటికి కారణమవుతున్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పైపులైన్లు ఎప్పటికప్పుడు మార్చాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం నీటి సరఫరా బాగానే ఉందని ఇబ్బందులు లేవని అంటున్నారు. నీటి నమూనాల్లో ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని చెబుతున్నారు.

డయేరియా కాదని కప్పిపుచ్చే ప్రయత్నం :గుంటూరు నగరంలో ప్రజలు అనారోగ్యానికి కారణమేంటనేది ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. బాధితులు కలుషిత నీరు తాగడం వల్లనా లేక కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారా అనేది తేల్చేందుకు నీళ్లు, ఆహార నమూనాలు సేకరించారు. అయితే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వసతులు ప్రభుత్వ ప్రయోగశాలల్లో లేవు. దీంతో కొన్ని పరీక్షల నిర్వహణకు నమూనాల్ని హైదరాబాద్‌కు పంపారు. అక్కడ పరీక్షలు చేసి నివేదికలు వచ్చే దాకా వేచి చూడాల్సిందే. నీళ్లు, ఆహార పదార్థాల నమూనా పరీక్షలు చేసేందుకు గుంటూరులో ప్రాంతీయ ప్రయోగశాల ఉన్నా అందులో అన్ని పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. నీళ్లల్లో క్లోరిన్‌, ఆమ్లం, నైట్రేట్స్‌, ఫ్లోరైడ్‌ కంటెంట్‌ ఎక్కువ, ఉందా తక్కువ ఉందా అనేది మాత్రమే ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంది.

రసాయనాల మిశ్రమం చేసుకునేందుకు అవసరమైన స్కోప్‌లు లేవు. ఉన్న వాటితోనే పరీక్షలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. వీరిచ్చే నివేదికల్ని ప్రామాణికంగా తీసుకుని రైల్వే, ఆహార కల్తీశాఖ యంత్రాంగం స్వీట్‌ షాపులు, రైల్వే వెండర్లు, హోటళ్ల నిర్వాహకులకు అపరాధ రుసుము విధిస్తున్నారు. నీటి నమూనాలు సేకరించి పరీక్షించేందుకు అవసరమైన సిబ్బంది లేరు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులే నగర, పురపాలిక ల నుంచి నీటి నమూనాలు సేకరించి వారే పరీక్షలు చేస్తున్నారు. ఇన్ని లోపాలు పెట్టుకుని ప్రభుత్వం మాత్రం తమ తప్పేం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. కలుషిత నీరే కారణమని ఆరోపణలున్నా ఆ విషయం దాటవేయాలని చూస్తోంది. గుంటూరులో వచ్చింది డయేరియా కాదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనవసర నిందలు వేయొద్దని మంత్రి విడదల రజిని, మేయర్ కావటి మనోహర్ వ్యాఖ్యానించటం బాధితులకు పరిహారం విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవటం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

సమస్యకు కారణాలు చెప్పకుండా దాటవేయటం :ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయటం ఆ తర్వాత వదిలేయటం యంత్రాంగానికి అలవాటుగా మారింది. సురక్షిత తాగునీటి సరఫరా అనేది బాధ్యతగా భావించి చిత్తశుద్ధితో పని చేయటంతో పాటు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పుడే గుంటూరు వంటి ఘటనలు జరగకుండా నివారించటం సాధ్యమవుతుంది. విపక్షాలను, మీడియాను నిందించటం, సమస్యకు కారణాలు చెప్పకుండా దాటవేయటం వల్ల ఉపయోగం లేదన్న విషయం ప్రభుత్వం గుర్తించాలి.

గుంటూరులో డయేరియా కలకలం - కలుషిత నీరు తాగి యువతి మృతి, 10 మందికి అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details