Mahashivaratri Fasting Rules : మహాశివరాత్రి (Mahashivratri) పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు కోసం ఎంతో మంది శివ భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ (బుధవారం) మహాశివరాత్రి పండుగ జరుపుకోనున్నారు. ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ వివరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. చాలా మందికి తలస్నానానికి, తలంటు స్నానానికి తేడా తెలియదు. తలస్నానం అంటే- కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం. తలంటు స్నానం అంటే- తలకి నూనె రాసుకుని కుంకుడుకాయ లేదా షాంపూతో రుద్దుకుంటూ స్నానం చేయడం.

ఉపవాస నియమాలు!
మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి. పాలు, పండ్లను ఆహారంగా తినాలి. ఎక్కువ మంది శివరాత్రి రోజున ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటుంటారు. కానీ, శివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే మరుసటి రోజున సాత్విక ఆహారం తినాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. 'నమః శివాయ' అనే పంచాక్షరి మంత్రం జపిస్తే సరిపోతుంది. అసౌచం అంటే జాతాసౌచం, మృతాసౌచం ఉన్నవాళ్లు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండడమని అర్థం. ఉపవాసం ఉండే వారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించాలి. 'నమః శివాయ అనే మంత్రం లేదా శ్రీం శివాయ నమః' అని స్మరించుకోండి.

శివరాత్రి రోజు జాగరణ!
జాగరణ చేయడం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అని అర్థం. చాలా మంది ఆ రోజున జాగరణ పేరుతో సినిమాలకు వెళ్తుంటారు. అలా చేస్తే జాగరణ చేసిన ఫలితం ఉండదని మాచిరాజు తెలిపారు. అయితే, శివ సంబంధమైన సినిమాలు చూడవచ్చు. వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్లి జాగరణ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. శివాలయంలో లేదా ఇంట్లో శివుడి స్తోత్రాలు వింటూ జాగరణ చేయాలి. ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వల్ల శివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ చెప్పారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
దేవాలయానికి ఎందుకు వెళ్లాలి! - ప్రదక్షిణల పరమార్థం ఏమిటో తెలుసా?
ఇంట్లో గుర్రాల పెయింటింగ్ వల్ల ప్రయోజనాలు - లక్ష్మీదేవి ఫొటో ఏమూలకు పెడితే ఎలాంటి లాభమో తెలుసా?