Nagarjuna Developed Water Sensor :ప్రస్తుత కాలంలో నీటి వృథాను అరికట్టడం తప్పనిసరిగా మారింది. ప్రజల్లో అవగాహనతో పాటు నీటి సంరక్షణకు సాంకేతికత అవసరం కూడా ఏర్పడింది. మన ఇంట్లో మోటార్ వేస్తాం ట్యాంక్ నిండిన తర్వాత ఆపేయటం మర్చిపోతాం. దీంతో నీరు వృథా అవుతుంది. ఈ ఇబ్బందికి సరికొత్తగా ఏఐతో పరిష్కారం చూపాడు ఈ వ్యక్తి. ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల నుంచి అవార్డులతో పాటు ఆవిష్కరణలకు పేటెంట్ కూడా పొందారు.
నాగార్జునది గుంటూరు స్వస్థలం. ఆర్థిక పరిస్థితులు, కెరీర్ గురించి చెప్పే వారు లేక ఇంటర్మీడియట్‌లో హెచ్ఈసీ చదివాడు. అయితేనేం చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులపై ఆసక్తి కనబరిచాడు. సామాజిక మాధ్యమాలను వారధిగా చేసుకుని నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు. ఆ తర్వాత దూరవిద్యలో ఎంసీఏ పూర్తి చేసి తన కెరీర్‌కు వినూత్నంగా బాటలు వేసుకున్నాడు.
AI Sensor to Curb Water Wastage : ఒక రోజు తాను ఉంటున్న ప్రాంతంలోని ఇళ్లపై నుంచి ట్యాంకులు ఓవర్ ప్లో అవ్వడాన్ని గమనించాడు నాగార్జున. ఓ స్నేహితుడు దీనికి ఏమైనా పరిష్కారం కనుగొనచ్చు కదా అని సలహా ఇచ్చాడు. తనకూ ఆ ఐడియా నచ్చడంతో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే ఇప్పటికే మార్కెట్లో కొన్ని రకాల సెన్సార్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో లేని మరికొన్ని ప్రత్యేక సదుపాయాలను పొందుపరుస్తూ తక్కువ ధరకు ఈ సెన్సార్ పరికరాన్ని అందివ్వాలని ప్రయత్నాలు చేశాడు.
ఇందుకోసం ఏఐ సాయంతో తక్కువ వ్యయం, ఎక్కువ కాలం పని చేసే సెన్సార్‌కు రూపకల్పన చేశాడు నాగార్జున. అదనపు ప్రయోజనాలు చేకూర్చేలా గుంటూరులో వినియోగంలోకి తెచ్చాడు. మున్సిపాలిటీ నీరు విడుదలైనప్పుడే సెన్సార్లు యాక్టివేటై మోటార్ ఆన్ అయ్యేలా డిజైన్ చేశాడు. సంపు లేదా ఓవర్ హెడ్ ట్యాంకు, మోటార్ ఇలా ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ ఈ పరికరాలను అమర్చి పని చేయిస్తాడు. సెన్సార్లను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించాడు.
"ఐవోటి ద్వారా వీటిని అనుసంధానం చేయడం జరిగింది. నీరు విడుదల కాగానే సెన్సార్లు యాక్టివేట్ అవుతాయి. తద్వారా మోటారు ఆన్ అవుతుంది. ట్యాంక్ నిండగానే మోటార్ ఆఫ్ అవుతుంది. కొన్ని చోట్ల మోటార్లకు పర్మిషన్ ఉండదు. అక్కడ స్మార్ట్ ట్యాప్‌లను ఏర్పాటు చేశాం. కొన్ని సార్లు ఎయిర్ లాక్ అయినప్పుడు వాటిని సాల్వ్ చేసే విధంగా ఏఐ సాయంతో డిజైన్ చేశాం." - నాగార్జున, ఆవిష్కర్త