Guntur GGH Doctors Performs Rare Surgeries:గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలే కాదు అరుదైన శస్త్రచికిత్సలతో రోగులకు కొత్త జీవితాన్నిస్తోంది. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చేయలేక చేతులెత్తేసిన కష్టతరమైన గుండె, ఇతర శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తూ పేదలకు బాసటగా నిలుస్తోంది. ఇలాంటి అరుదైన అపరేషన్లను ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో సైతం ఆసుపత్రి నిర్వహించడంతో పేదలు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఇదే సేవానిరతితో రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన వైద్యసేవలను అందించేందుకు సరికొత్త భవనాలు, అధునాతన సదుపాయాలతో సిద్ధమవుతోంది.
అరుదైన గుండె శస్త్రచికిత్సలు: ఉమ్మడి గుంటూరు సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఏ జబ్బు చేసినా GGH వైపే చూస్తున్నారు. దాదాపు పదిహేను వందల పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో నిత్యం 2 వేలకు పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. GGHలో గుండె శస్త్ర చికిత్సలు చేయించుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 60కి పైగా హృదయ సంబంధిత సర్జరీలను GGH వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యుల బృందం పలు రకాల అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తోంది.
GGHలో గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్టుతో ఒప్పందం చేసుకొని బైపాస్ సర్జరీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తరువాత కాలంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సేవలను పునరుద్ధరించేందుకు అప్పటి వైఎస్సార్సీపీ సర్కారు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మళ్లీ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
గుండె సంబంధిత ఆపరేషన్లే కాకుండా ఇతర అరుదైన సర్జరీలకూ GGH చిరునామాగా మారింది. రోడ్డు ప్రమాదంలో పక్కటెముకలతోపాటు గుండెకు రక్షణగా ఉన్న స్టెర్నల్ ఎముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన 66 ఏళ్ల చిన్నరామయ్యకు రాష్ట్రంలోనే తొలిసారిగా స్టెర్నల్ ప్లేట్ ఫిక్సేషన్ సర్జరీ చేసి ఆయన ప్రాణాలను కాపాడారు. ఆయనకు చికిత్స అందించలేమని హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులు సైతం చేతులెత్తేసిన తరుణంలో GGH వైద్యులు సర్జరీ చేసి ప్రాణాదానం చేశారు.
అదే విధంగా ఏలూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కిరణ్‌కుమార్ అనే యువకుడు పదేళ్లుగా రక్తహీనత సమస్యతో ఏలూరు, విజయవాడ సహా పలు చోట్ల ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో ఇటీవల GGHను ఆశ్రయించారు. ఇక్కడి వైద్యబృందం మొదటగా రోగికి ఉన్న అరుదైన వ్యాధిని గుర్తించి అత్యంత కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అంతే గాక గత నెలలో మహమ్మద్ అనే రోగికి మెడ వద్ద కణితి రావడంతో దీన్ని పెరెనిక్ నర్వ్ ట్యూమర్‌గా గుర్తించిన GGH వైద్యులు క్లిష్టతరమైన ఆపరేషన్‌ను నిర్వహించి కణితిని తొలగించారు.