Gruha Jyothi Scheme in Telangana : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు హమీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు అనే రెండు గ్యారంటీలు అమలులోకి తెచ్చింది. తాజాగా ఇళ్లకు ఉచిత కరెంట్ సరఫరా పథకం గృహజ్యోతి అమలు ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది.
Aadhaar Mandatory Gruha Jyothi Scheme :ఇందులో భాగంగా లబ్ధి పొందాలనుకునేవారు తొలుత ఆధార్ ఆథెంటిఫికేషన్ (Aadhaar Mandatory) చేయించుకోవాలని రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులిచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే, ఆధార్ సహా గుర్తింపుకార్డులు అవసరమని పేర్కొంది. ఈ మేరకు బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధనశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచనలు చేసింది.
గృహజ్యోతి పథకంపై ప్రభుత్వం కసరత్తు - అర్హుల వివరాల సేకరణలో విద్యుత్ పంపిణీ సంస్థలు
Gruha Jyothi Scheme Guidelines : దీన్నిబట్టి లబ్ధిదారుల ఎంపికకు పూర్తి స్థాయి మార్గదర్శకాలు తరువాత వెలువడతాయని అధికారులు భావిస్తున్నారు. గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme) లబ్ధిదారుల ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధనశాఖ నిర్దేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్‌ను విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని ఆ రుజువు చూపాలి. ఆధార్ జారీ అయ్యేవరకు ఏదైనా ఇతర గుర్తింపు కార్డు విద్యుత్ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది.