Job Aspirants Meets KTR in Hyderabad : 'నాడు జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నీటి మూటలుగా తేల్చారు. మెగా డీఎస్సీ అన్నారు దగా చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీల్లో పోస్టులు పెంచి తీరాల్సిందే, వదిలిపెట్టము. ఇందుకోసం అన్ని సభల్లో నిలదీస్తామని' బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు కేటీఆర్‌ను కలిశారు. ఆయనకు వారి ఇబ్బందులు చెబుతూ తమకు అండగా నిలవాలని కోరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన గ్రూప్ 1, డీఎస్సీ నోటిఫికేషన్లకు కొన్ని పోస్టులు మాత్రమే పెంచారన్నారు. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీల్లో పోస్టులు పెంచి తీరాల్సిందే వదిలిపెట్టబోమని అన్ని సభల్లో నిలదీస్తామని చెప్పారు. అయితే పోటీ పరీక్షల అభ్యర్థులు మాత్రం ఎమ్మెల్యేలు అందరినీ కలిసి ఒత్తిడి తేవాలని సూచించారు. డిప్యూటీ సీఎం గతంలో హామీ ఇచ్చినట్లుగా గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలవాలన్నారు.
అన్ని పరీక్షలు వరుసగా ఉన్నాయని, విరామం ఎక్కువగా ఉండేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే మేమంతా రోడ్డు ఎక్కి, ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామన్నారు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులే మీ సంగతి తెలుస్తారని హెచ్చరించారు.