Group 2 Preparation in Telangana : ఒకవైపు గ్రూప్-3 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగాయి.. మరోవైపు డీఎస్సీ అభ్యర్థులు ఉద్యోగాలు పొంది ఉద్యోగాల్లో చేరాయి.. ఇంకోవైపు గ్రూప్-4 పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇక రేపోమాపో వారూ కూడా విధుల్లో చేరతారు. ఇక మిగిలింది అందరూ ఉన్నతంగా భావించే గ్రూప్-2 పరీక్ష. ఇది తెలంగాణలోని టీజీపీఎస్సీ సర్కారీ కొలువుల అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది.
గ్రూప్ -2 పరీక్షలకు ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే డిసెంబరు 15,16 తేదీల్లో నిర్వహించడానికి టీజీపీఎస్సీ ముమ్మర ఏర్పాట్లను చేస్తుంది. మరో 24 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రణాళికాబద్ధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే కొలువు సాధించవచ్చని విద్యాధికులు చెబుతున్న మాట. గతంలో గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని సాధన చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
గ్రూప్-3 పరీక్ష పేపర్లను సమీక్షించుకోవాలి :
- మూడు రోజుల క్రితమే గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి.
- గ్రూప్-3, గ్రూప్-2 ఉద్యోగాలకు సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది.
- గ్రూప్-3లోని పేపర్-1లో రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగారు.
- దీన్ని గమనించి అందుకు అనుగుణంగా సాధన చేస్తే ఫలితం ఉంటుంది.
- గ్రూప్-2లో మాత్రం రెండు రోజుల్లో నాలుగు పేపర్లు ఉంటాయి.
- ఈ కొద్ది సమయంలో గ్రూప్-3లోని మూడు పేపర్లలో ప్రశ్నలు ఎలా అడిగారు? ఏఏ అంశాలు కవర్ చేశారో గమనించుకోవాలి.
- నాలుగు పేపర్లను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన సాధన అవసరం.
- తమకు పట్టున్న అంశాలకు అనుగుణంగా ఆయా పేపర్లను మళ్లీ చదవాలి.
- దీంతో పాటు ఇంతకుముందు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను మరోసారి రివిజన్ చేయాలి.
ఒత్తిడిని దగ్గరకు రానివ్వోద్దు :సమయం తక్కువ ఉన్నందున సిలబస్ అంతా చదవడంతో సమయం వృథాగా పోయే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-3లో అడిగిన ప్రశ్నలు, సిలబస్ గమనించి దీనికి అనుగుణంగా స్మార్ట్‌గా ప్రిపరేషన్ ఉండాలి. దీంతో జరగబోయే పరీక్ష పేపర్ల తీరు అర్థమవుతుంది. ముందుగా పాఠ్యాంశాలను చదివి ఆ తర్వాత అడిగే ప్రశ్నలు సాధన చేస్తే మీ సామర్థ్యం మీకే అర్థం అవుతుంది. రీజనింగ్, అర్థమెటిక్, ఆంగ్లం, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ పై సాధన చేయాలి. కరెంట్ అఫైర్స్‌లో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను జాగ్రత్తగా గమనించాలి. సమయం లేదని ఒత్తిడికి గురికాకుండా సన్నద్ధం కావాలి.