తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లు - డెకాయ్‌ ఆపరేషన్స్‌తో సూత్రధారుల గుట్టురట్టు - TG GOVT FOCUS ON DRUGS CONTROL

TGNAB Focus On Drugs In Hyderabad: బెంగళూరు నుంచి సింథటిక్‌ డ్రగ్స్‌ ఆంధ్రా ఒడిషా సరిహద్దుల నుంచి గంజాయి రాజస్థాన్‌ నుంచి ఓపీయం, అమెరికా నుంచి ఓజీ అలా హైదరాబాద్‌ని అడ్డాగా చేసుకొని మాదకద్రవ్యాల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలని వేదికగా చేసుకొని యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యనగరంలోని పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, పార్టీల్లో మత్తు తప్పనిసరిగా మారింది. నగరాన్ని కమ్మేస్తున్న ఆ మత్తుభూతాన్ని భూస్థాపితం చేసే లక్ష్యంతో టీజీన్యాబ్‌ కఠిన చర్యలకి సిద్ధమైంది.

Govt Focus On Drugs In Hyderabad
TGNAB Focus On Drugs In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 10:58 AM IST

Telangana Govt Focus On Drugs In Hyderabad: రాష్ట్రంలో మాదకద్రవ్యాలు ప్రవేశించేందకు వీల్లేదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్‌ మూలాలని పెకిలించే లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డెకాయ్‌ ఆపరేషన్స్‌తో సూత్రధారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేపట్టారు. అంతరాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులు తప్పనిసరిగా ఆయుధాలు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించటం సహా లక్షలాది మంది యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న మత్తు స్మగ్లర్లను వదలబోమని టీజీన్యాబ్‌ అధికారులు స్పష్టంచేశారు. నగరానికి ఏడీఎమ్ఏ చేరవేస్తున్న ముఠా గుట్టును డెకాయ్‌ ఆపరేషన్‌తోనే బట్టబయలు చేశారు.

ఆంధ్ర ఒడిషా సరిహద్దు, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రైవేట్‌ వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో నేరగాళ్లు గంజాయిని నగరానికి చేరవేస్తున్నారు. ఇప్పటివరకు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో సరైన తనిఖీలు లేకపోవటంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల కన్నుగప్పి చేరవేసిన సరుకును శివారు ప్రాంతాల్లో గోదాముల్లో నిల్వ ఉంచేవారు. అక్కడ నుంచి అంతరాష్ట్ర వాహనాల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటకకి తరలించేవారు.

డ్రగ్స్ వాడొద్దని భారతీయుడు-2 టీమ్ స్పెషల్ వీడియో - అభినందించిన సీఎం రేవంత్​ - CM Revanth Reacts on Bharateeyudu 2

ప్రధాన స్థావరాలపై టీజీన్యాబ్‌ నిఘా : కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్సీ బ్లాట్స్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌కు బెంగళూరు కేరాఫ్‌ చిరునామాగా మారడంతో హైదరాబాద్‌లోని నైజీరియన్లు అక్కడకి చేరారు. సుమారు 100 మంది నైజీరియన్లు దేశంలోని ప్రధాననగరాల్లో ఏజెంట్లని నియమించుకొని భారీగా డ్రగ్స్‌ చేరవేస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, రాజస్థాన్‌లోని ప్రధాన స్థావరాలపై టీజీన్యాబ్‌ నిఘా ఉంచింది. మూడు రాష్ట్రాల పోలీసుల సహకారంతో డ్రగ్స్‌ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టీజీన్యాబ్‌ బృందాలు మకాం వేశాయి.

ఏపీ, ఏవోబీ నుంచి రవాణా అయ్యే గంజాయిలో 60శాతం ధూల్‌పేట్‌కు చేరుతుంది. ఇక్కడ స్థిరనివాసం ఉన్న సుమారు 40 కుటుంబాలు ఆ గంజాయిని నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, పటాన్‌ చెరువు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ కిరాణ, పాన్‌దుకాణాల ముసుగులో 5 నుంచి 10 గ్రాముల ప్యాకెట్లుగా రూపొందించి విక్రయిస్తున్నారు. ఆ లావాదేవీలపై సమగ్ర సమాచారం రాబట్టిన పోలీసులు ఎక్సైజ్‌ విభాగంతో కలిసి తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పలుమార్లు కేసులు నమోదుచేసినా దారికిరాని వారిపై పీడీయాక్ట్‌ ప్రయోగించాలని భావిస్తున్నారు.

యాంటీ డ్రగ్స్‌ కమిటీలు ఏర్పాటు : హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో మత్తు ఆనవాళ్లు గుర్తించిన పలు పబ్‌ల నిర్వాహకులు, ప్రముఖ విద్యాసంస్థల యజమాన్యాలను టీజీన్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. ఇటీవల ఓజీ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, ఈ-సిగరెట్ల వాడకంపై పలు పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన సదస్సులు చేపట్టారు. మత్తుపదార్ధాలకు అలవాటుపడితే జీవితంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయనేది వివరిస్తున్నారు. యాంటీ డ్రగ్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన నిందితులు, కొనుగోలుదారుల్లో కొందరు ఫోన్‌ నెంబర్లు మార్చి మారుపేర్లతో మళ్లీ దందా చేస్తున్నట్లు నిర్దారించారు. వారిలో ఈవెంట్‌ మేనేజర్లు, డీజేలు, పబ్‌ల నిర్వాహకులు ఉన్నట్టు గుర్తించారు. వారి కదలికలపై నిఘాఉంచిన పోలీసులు కొందర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్​గా పబ్స్​ - మత్తుదందాలో ప్రధాన పాత్ర డీజేలదే! - DRUGS USAGE IN HYDERABAD PUBS

మణికొండ డ్రగ్స్‌ కేసు - పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు - Manikonda Cave Pub Drugs Case

ABOUT THE AUTHOR

...view details