Officers Cast Their Vote in Telangana 2024 :రాష్ట్రమంతటా లోక్‌సభ ఎన్నికల వాతావరణం సందడిగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాలు వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలోనే అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌లో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం నాడు అక్కడక్కడ వర్షాలు పడడంతో పోలింగ్ సామగ్రిని తరలించేందుకు కాస్త ఇబ్బందులు తలెత్తినట్లు వికాస్‌రాజ్ పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల బండ్లపై ఈవీఎంలు తీసుకెళ్లారని ఆయన చెప్పారు.
Telangana Lok Sabha Elections 2024 : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని వికాస్‌రాజ్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. వేసవి నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించామన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వికాస్‌రాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రశాసన్‌నగర్‌లో సీఎస్ శాంతికుమారి, జూబ్లీహిల్స్ సెంట్రల్ నర్సరీలో డీజీపీ రవిగుప్తా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు విశాంత్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన అధికారులు : మాదాపూర్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, కొండాపుర్‌లోని చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దంపతులు, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ దంపతులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్‌రెడ్డి దంపతులు బంజారాహిల్స్‌లోని సెయింట్ ఆగస్టీన్ స్కూల్లో ఓటేశారు. బంజారాహిల్స్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సి.పార్థసారథి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు లాంటిది ఓటు అని, ఐదేళ్ల మన భవిష్యత్‌ను నిర్ణయించేది ఇదేనని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రతి ఓటు విలువైనదే కాబట్టి, తప్పక వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు.