New Ration Card Applications : కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ సర్కారు కీలక ప్రకటన చేసింది. మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని స్పష్టం చేసింది. దరఖాస్తుల సమర్పణకు నిర్దేశిత గడువు ఏమీ లేదన్న సర్కార్, కులగణన, ప్రజా పాలనలో అర్జీలు ఇచ్చిన వారు మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు సహా కుటుంబసభ్యుల్ని పౌర సరఫరాల శాఖ చేర్చుతోంది. కొత్తగా 18 లక్షల మంది పేర్లు చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారు.
మీ సేవ కేంద్రాల్లో జనం : కొత్త రేషన్‌కార్డుల కోసం మీ సేవ కేంద్రాలకు జనం పోటెత్తడంపై ప్రభుత్వం స్పందించింది. దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ప్రకటించింది. కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు ఏమీ లేదని వెల్లడించింది. అర్జీదారులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కుల గణన, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. మీ సేవలో దరఖాస్తు చేసిన రసీదును దాచిపెట్టుకోవాలన్న పౌర సరఫరాల శాఖ, దాన్ని ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొంది.
రేషన్‌కార్డుల్లో పిల్లల పేర్లు :తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లూ చేరుతున్నాయి. పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి కార్డుల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది. 12 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా, 6 లక్షల 70 వేల కుటుంబాలు అర్హమైనవిగా గుర్తించినట్లు సమాచారం.