Governor Speech At Republic Day Celebrations :సాంస్కృతిక వారసత్వంతో, ప్రజా స్వామ్య ఆచారాలతో తెలంగాణ ముందుకు వెళ్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, తక్షణ అవసరాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 76వ గణతంత్ర వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించిన గవర్నర్ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలిపారు. వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిందన్నారు.
సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించిందని, సర్వే ఆధారంగా కొత్త విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుందని స్పష్టం చేశారు.ఇవాళ నాలుగు పథకాలను ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రజలకు అందిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అని గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ హామీ ఇచ్చారు.
జయ జయహే తెలంగాణ గీతం : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజా కవి అందె శ్రీ రాసిన ప్రసిద్ధ గీతం జయ జయహే తెలంగాణ జనని జయ కేతనం రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించబడిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవాలలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పాల్గొన్నారు.
వ్యవసాయం వెన్నెముకగా :తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉందని, ఈ ప్రభుత్వ హయాంలో గత ఏడాది వర్షాకాలంలో రికార్డు స్థాయిలో 1.59 కోట్ల టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా ఆవిర్భవించడంలో తెలంగాణ గొప్ప ఘనతను సాధించింది అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. ఆర్థిక భారాలను తగ్గించడానికి 27 రోజుల్లోనే 2 లక్షల రూపాయల పంట రుణ మాఫీని అమలు చేసిందని స్పష్టంచేశారు. పంట రుణ మాఫీ ప్రయోజనం 25 లక్షల 35 వేల 934 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. రైతు భరోసాతో ఏటా ఎకరానికి రూ.12,000 పెంచిన ఆర్థిక సహాయం రైతులకు పెట్టుబడి పెట్టడానికి భరోసా ఇస్తుందన్నారు.
యువతక ఉజ్వల భవిష్యత్తుకు : తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి శిక్షణను అందించడం సాధ్యమవుతుందన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే వారిని ప్రోత్సహించడానికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సంవత్సరం బీసీల సంక్షేమం కోసం రూ. 9200 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
ఉచిత విద్యుత్ సరఫరా :సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళలు, లింగమార్పిడిదారులకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, తెలంగాణ అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు మొదలైన ఆరు పరివర్తన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సంక్షేమం, ఆహార భద్రత, గృహనిర్మాణం వంటి బహుళ రంగాలకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. నిరాశ్రయులైన, అర్హత కలిగిన కుటుంబాలు ఇళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. 2024-2025లో రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో 4,50,000 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేయాలని, రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.