Governor as Chancellor Basara RGUKT : బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయానికి మిగిలిన యూనివర్సిటీల మాదిరిగా గవర్నర్‌నే కులపతిగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు విశ్వవిద్యాలయ చట్టంలో సవరణ చేయాలని యోచిస్తోంది. ఇటీవల తెలంగాణలోని 10 విశ్వ విద్యాలయాలకు మాత్రమే ఉప కులపతుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్, ఆర్జీయూకేటీని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ వర్సిటీకి కూడా శాశ్వత ఛాన్స్‌లర్‌ను నియమించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ వర్సిటీ చట్టాన్ని పరిశీలిస్తోంది.
Basara IIIT Vice Chancellor Tenure : ప్రస్తుత వర్సిటీ చట్ట ప్రకారం వైస్ ఛాన్స్‌లర్ (Vice Chancellor) పదవీ కాలం ఐదేళ్లు ఉండగా, మిగిలిన వర్సిటీల మాదిరిగా మూడేళ్లు చేయాలన్న ఆలోచనలో ఉన్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా సమాయత్తమవుతోంది. వీలైతే ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టి త్వరగా శాశ్వత కులపతి నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు.
ఆన్‌లైన్ కోర్సులకు వర్చువల్ విశ్వవిద్యాలయాలు!
2015 నుంచి ఇంఛార్జ్ వీసీలే :బాసర ఆర్జీకేయూటీకి (Basara RGUKT) 2010 ఫిబ్రవరి నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఐదేళ్ల పాటు ఐఐటీ ఖరగ్‌పుర్‌కు చెందిన ఆచార్య ఆర్‌వీ రాజకుమార్ వీసీగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి శాశ్వత ఉపకులపతి లేరు. రాజకుమార్ పదవీ కాలం అనంతరం రెండేళ్ల పాటు ఓయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ, 2017 నుంచి 2020 వరకు అప్పటి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్, ఆ తర్వాత రాహుల్ బొజ్జా ఇంఛార్జ్ వీసీలుగా వ్యవహరించారు. అంటే దాదాపు ఐదేళ్ల పాటు ఐఏఎస్ అధికారులే ఇంఛార్జ్ ఉపకులపతులుగా ఉన్నారు.