New Government Medical Colleges Run Under PPP System : రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పీపీపీ విధానంలో కళాశాలల నిర్వహణకు ట్రాన్సక్షన్ సర్వీస్ సంస్థను త్వరలో టెండర్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ట్రాన్సక్షన్ సర్వీస్ సంస్థ కళాశాలలు ఏర్పాటుకానున్న ప్రాంతాలు, వాటి ప్రాధాన్యం, ఇప్పటివరకు పెట్టిన ఖర్చు నిర్మాణాలు ఏ స్థాయి వరకు జరిగాయి వంటి అంశాలను పరిశీలించనుంది. వీటితో పాటు ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ పరీక్షలు, వాటికి అవసరమైన యంత్రాలు, పరికరాలకు ఎంత వరకు ఖర్చు పెట్టాలనే అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది.
పీపీపీ విధానంలో నడిపేలా అడుగులు : MBBS, ఇతర కోర్సుల్లో ప్రవేశాల ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం, డాక్టర్ల అవసరాలు, వేతనాల చెల్లింపులు, ఇతర వివరాలతో ట్రాన్సక్షన్ సర్వీస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయించనుంది. యూపీ, గుజరాత్‌లో పీపీపీ, ఇతర పద్ధతుల్లో నడుస్తోన్న వైద్య కళాశాలల పనితీరునూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పార్వతీపురం, అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లులోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పాడేరు, పిడుగురాళ్లలోని కళాశాలల్లో మాత్రమే ప్రభుత్వ పరంగా ప్రవేశాలు జరగనున్నాయి.
మెడికల్ ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేత- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
10 వైద్య కళాశాలలకు ప్రణాళికలు : రాష్ట్రంలో 10 నూతన వైద్య కళాశాలల నిర్మాణాలు కొంత వరకు పూర్తయ్యాయి. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వీటి అనుబంధ ఆసుపత్రుల్లో పడకలు, వైద్య సదుపాయాలు కొంతవరకు అందుబాటులోకి వచ్చాయి. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.8,480 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో రూ. 4,948 కోట్లను నాబార్డు, సీఎస్‌ఎస్, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధి కింద పొందుతామని తెలిపింది. ఐతే వీటిలో కేవలం 25 శాతం పనులే పూర్తయ్యాయి. రూ.1,451 కోట్ల చెల్లింపులే జరిగాయి. ప్రస్తుతం కళాశాలల నిర్మాణాలను ప్రభుత్వం సేఫ్ సీజ్ కింద నిలిపేసింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించాలనుకున్న పాడేరుతో పాటు ఇతర 4 కళాశాలలకు తగ్గట్లు వైద్యుల నియామకాలు కొంతవరకు పూర్తయ్యాయి.
నియామకాలు చేపట్టనున్న ప్రైవేటు సంస్థలు : పీపీపీ విధానంలో కళాశాలలు నిర్వహించనున్నందున ప్రైవేట్ సంస్థలే వైద్యుల నియామకాలు చేపట్టాల్సి ఉంది. కళాశాలల నిర్వహణకు 5 ఏళ్ల పాటు ప్రతి ఏడాదీ కనీసం రూ.75 కోట్ల చొప్పున ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండొచ్చు. MBBS లో సీట్లు, పీజీలో కోర్సుల ప్రారంభానికి తగ్గట్లు ఫీజులు ప్రైవేటు సంస్థలకు అందుతాయి. ప్రభుత్వ ఒప్పందాన్ని అనుసరించి నిర్ణీత వైద్య సీట్లు, ఫీజులు, ఆసుపత్రుల్లో పేదలకు పడకల కేటాయింపు, వ్యాధి నిర్ధరణ పరీక్షలు, ఇతర విషయాల్లో లాభాపేక్ష లేకుండా యాజమాన్యాలు వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల స్థాయిని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనాలు పరిగణనలోనికి తీసుకుని వయబులిటీ గాప్ ఫండ్ కింద అవసరమైన నిధుల్లో 45 శాతం వరకు ఆర్థిక సహకారాన్ని అందించనుంది.
వసతి గృహాల్లో బిక్కుబిక్కుమంటున్న మెడికోలు- వసతి గృహాల నిర్వహణ గాలికొదిలేసిన వైసీపీ
పేదలకు అందని వైద్యం - కనీస సౌకర్యాలు లేక ప్రైవేటు ఆసుపత్రులను రిఫర్ చేస్తున్న వైద్యులు