Sankranti Rush at Visakhapatnam Railway Station : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విశాఖ రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. స్టేషన్‌కు వచ్చే సమయానికే రైళ్లన్నీ పూర్తిగా నిండిపోతుండడంతో ప్రజలు పట్టాలపైకి వచ్చి నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. దీంతో రైలు రాకముందే ప్రయాణికులు పరుగులు తీసి రైళ్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు RPF ప్రత్యేక బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
Special Trains for Sankranti 2025 : రాష్ట్రంలో అతి పెద్ద పండగ మకర సంక్రాంతి కోసం రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ఆదనంగా నడిపిస్తోంది. అయితే, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పని చేస్తున్నచిరుద్యోగులకు రైలు ప్రయాణమే ఆధారంగా మారింది. దూర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు చేరుకునేందుకు రైలు కోసం వచ్చిన వారికి నిరాశే ఎదురవుతోంది. రైళ్లు కిటకిటలాడుతుండటంతో వారు దిక్కుతోచని పరిస్థితులోకి వెళ్తున్నారు. వచ్చే రైలులోనే తమ అదృష్టం పరీక్షించుకుందామంటూ ప్లాట్ ఫాం పైనే వేచి చూస్తున్నారు. సొంతూళ్లకు చేరుకునేందుకు లగేజీతో పాటు పిల్లలు-మహిళలు-వృద్దులతో వచ్చిన వారికి అధిక రద్దీని చూసి బెంబేలెత్తుతున్నారు. మరికొందరు మాత్రం రైళ్లో సీట్ల సంగతి పక్కన పెడితే, ఎలాగో అలాగ రైలు ఎక్కితే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
రైలు ఎక్కలేం, బస్సును భరించలేం - ప్రైవేటు ఛార్జీ తెలిస్తే నోరెళ్లబెడుతారు!
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు కొద్దిరోజుల క్రితమే దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం జిల్లాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఈనెల 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంక్రాంతి రద్దీపై ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు- ఆ బాధ్యత రవాణా శాఖ అధికారులదే