తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇద్దరిని నమ్మి షేర్‌ మార్కెట్లో రూ.60 లక్షలు పెట్టిన హెచ్​ఎం - లాభం, అసలు ఇవ్వకపోవడంతో? - GOVT SCHOOL HEADMASTER SUICIDE

ఇద్దరు వ్యక్తులను నమ్మి షేర్‌ మార్కెట్​లో రూ.60 లక్షల పెట్టుబడి - లాభం, అసలు ఇవ్వకుండా మోసం - పురుగు మందు తాగి ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య

GOVT TEACHER SUICIDE IN AP
Govt School Headmaster Suicide in Anantapur (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 9:59 AM IST

Govt School Headmaster Suicide in Anantapur : ఇద్దరిని నమ్మి వారితో కలిసి షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టగా, లాభం తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటు చేసుకుంది. కూడేరు సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం బళ్లారి రోడ్డులో ప్రశాంతి కుటీర్‌లో భాస్కర్‌ బాబు (53), ఆయన భార్య సునీత నివాసముంటున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, ప్రస్తుతం భాస్కర్‌ బాబు మల్లికేతిలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేస్తున్నారు.

నగరంలో ఉంటున్న కంబదూరుకు చెందిన మిత్రుడు గాజుల శ్రీనివాసులు, అతని స్నేహితుడు బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేశ్​కుమార్​ రెడ్డి అనంతపురంలో షేర్‌ మార్కెట్, ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో షేర్‌ మార్కెట్​లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ హెచ్‌ఎంను నమ్మించారు. వారి మాటలు నమ్మిన హెచ్ఎం, లోన్​ యాప్‌లు, బ్యాంకులు, బయట వ్యక్తల నుంచి రుణం తీసుకుని సుమారు రూ.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దీనికి వారు ప్రామిసరీ నోట్లు, చెక్కు పుస్తకం కూడా ఇచ్చారు.

న్యాయం చేయాలంటూ సూసైడ్​ నోట్ :కొన్నాళ్ల పాటు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇస్తూ వచ్చారు. ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అతని పెట్టుబడికి సంబంధించిన ఎలాంటి లాభం, అసలు ఇవ్వకుండా మొండికేశారు. ఈ నేపథ్యంలో అప్పుల భారం పెరిగి బ్యాంకులు, యాప్‌లలో తీసుకున్న రుణాలకు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారింది. దీంతోపాటు బయటి వ్యక్తులు కూడా అప్పు చెల్లించాలంటూ అడగటంతో ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పుల బాధ భరించలేక ఈ నెల 22న కూడేరు మండలం కమ్మూరు సమీపంలో సూసైడ్‌ నోట్ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

ఈ క్రమంలో హెచ్‌ఎం భాస్కర్‌బాబును స్థానికులు గుర్తించి చికిత్స కోసం అత్యవసర వాహనంలో అనంతపురం తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతి చెందారు. నరేశ్‌ కుమార్‌ రెడ్డి, గాజుల శ్రీనివాసుల నుంచి రూ.60 లక్షలు ఇప్పించి తనకు న్యాయం చేయాలంటూ సూసైడ్​ నోట్​ ద్వారా మృతుడు పోలీసులను కోరారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. హెచ్​ఎంకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

లోన్​యాప్ నిర్వాహకుల​ వేధింపులు - తట్టుకోలేక మిషన్​ భగీరథ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్​లైన్​లో విషం తెప్పించుకొని - సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details