Government Focus on LRS Petitions : వైఎస్సార్సీపీ హయాంలో నష్టపోయిన ప్రజలందరి ఇబ్బందులు తీరుస్తూ వస్తున్న కూటమి సర్కార్ ఇప్పుడు ప్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపింది. 2020లో లేఅవుట్ క్రమబద్ధీకరణతో పథకాన్ని ప్రారంభించిన వైఎస్సార్సీపీ రూ.470 కోట్లు ఫీజులు వసూలు చేసింది. ఆ డబ్బుని పక్కదారి పట్టించి ప్రజలకు అవస్థలు మిగిల్చింది. దీంతో LRSలో ఉన్న 14 వేల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి ప్లాట్లు క్రమబద్ధీకరించకుండా ప్రజలను అప్పులపాలు చేసిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా పరిష్కరించి ప్రజల వెతలు తీర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి సంస్థల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై మరోసారి తాఖీదులు ఇవ్వనున్నారు. వీటి పరిష్కారానికి దరఖాస్తుదారుల నుంచి రావాల్సిన అదనపు సమాచారం, దస్త్రాలు, చెల్లించాల్సిన ఫీజులపై నోటీసులు సిద్ధం చేస్తున్నారు.
LRS: ఎల్‌ఆర్‌ఎస్ లేఅవుట్ల పరిశీలనకు ప్రభుత్వం మార్గదర్శకాలు
దరఖాస్తుదారులకు పోస్టులో నోటీసులు : గతంలోనూ ఇలాగే తాఖీదులిచ్చినా స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారా ప్రజలు మొదట ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు చేశారు. నోటీసులు వారికే వెళ్లినా చాలామంది సరిగా స్పందించలేదు. దరఖాస్తుదారులతో సర్వేయర్లు మాట్లాడి పట్టణాభివృద్ధి సంస్థలు అడిగిన అదనపు సమాచారం పంపాలి. అలాంటి ప్రయత్నం లోపించడంతో పెండింగ్ దరఖాస్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో చిరునామా అందుబాటులో ఉన్న దరఖాస్తుదారులకు పోస్టులో నోటీసులు పంపనున్నారు. మిగతా వారి ఫోన్లకు సమాచారం అందివ్వనున్నారు. అడిగిన అదనపు సమాచారం, దస్త్రాలు పంపిన వారందరి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని పట్టణాభివృద్ధి సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.