New Ration Cards In AP :రాష్ట్రంలో రేషన్ కార్డుకు అర్హులైన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావడంతో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ప్రభుత్వం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డులకు మొదట దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అనంతరం కార్డుల మంజూరు చేయబోతున్నారు.
సంక్రాంతిలోపు ఈ కొత్త రేషన్ కార్డులు : ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన, మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తారు. తరువాత సంక్రాంతిలోపు ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హుల గుర్తింపు పక్రియ పూర్తి చేస్తారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.
కొత్త జంటలకూ రేషన్ కార్డు - కుటుంబ సభ్యుల చిత్రాలతో సరికొత్తగా!
అన్నింటికీ రేషన్ కార్డులే : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుతో పాటు, ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పిస్తూ డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు పింఛను మంజూరు చేయాలన్నా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్నా, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా ప్రాథమికంగా బియ్యం కార్డు కలిగి ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇవి తప్పకుండా ఉండాలి.