Government Focus on Indiramma House Scheme in Telangana : రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నాలుగు దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ కార్డు ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వనుంది.
దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేయనుంది. స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని ఇవ్వనుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారితో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 'అభయ హస్తం’ పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.
Indiramma Housing Scheme in Telangana :దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు చేరడంతో ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. ఆ ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుంది.
మిగితా 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించిన విషయం విధితమే. ఈ సందర్భంగా నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందజేయనుంది. బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు(Roof) స్థాయిలో రూ.లక్ష సహాయం చేయనుంది. పైకప్పు నిర్మాణం తరువాత రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష ఆర్థిక సహాయం ఇవ్వనుంది.