ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డ్రగ్స్‌ నియంత్రణకు పోలీస్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌- గాంజా సమాచారమిస్తే గిఫ్ట్ - Govt Focus Eradicate Drugs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 11:19 AM IST

Government Focus on Eradicate Ganja and Drugs: గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. రాష్ట్రస్థాయిలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనుంది. అసలైన కింగ్‌పిన్‌లను పట్టుకోని వారికి శిక్షపడేలా చేయడమే బాధ్యతగా పనిచేయనున్నాయి. మత్తుపదార్థాల స్మగ్లింగ్, సరఫరా తదితర అంశాల ఫిర్యాదుల కోసం వారం రోజుల్లోగా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

toll_free
toll_free (ETV Bharat)

Government Focus on Eradicate Ganja and Drugs:గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్రస్థాయిలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనుంది. ప్రాంతాల వారీ హాట్‌ స్పాట్‌లను గుర్తించడంతోపాటు వాటి మ్యాపింగ్‌, సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు బలోపేతం చేయడం, అసలైన కింగ్‌పిన్‌లను పట్టుకోవడంతోపాటు వారికి శిక్షపడేలా చేయడం వంటి బాధ్యతల్ని ఈ ప్రత్యేక సంస్థలు తీసుకోనున్నాయి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీధివీధికీ వ్యాపించిన గంజాయి, డ్రగ్స్‌ కట్టడికి రాష్ట్ర పోలీసు శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. దీని కోసం రాష్ట్ర స్థాయిలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనుంది. మత్తుపదార్థాల స్మగ్లింగ్, సరఫరా, నిల్వ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ వారం రోజుల్లోగా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తీసుకురానుంది. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన కీలక సమాచారమిస్తే వారికి నగదు బహుమానం ఇస్తారు.

మాదకద్రవ్యాల రహితంగా రాష్ట్రాన్ని మారుస్తాం : హోం మంత్రి అనిత - Home Minister In Anti Drug Day

టీడీపీ పాలనలో 2014-18 మధ్య 2,948 కేసులు నమోదు కాగా, వైఎస్సార్సీపీ హయాంలో 2019-23 మధ్య 6,560 కేసులు నమోదయ్యాయి. 122 శాతం మేర గంజాయి, డ్రగ్స్‌ కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా డ్రగ్స్‌ కట్టడికి రానున్న వంద రోజుల్లో పోలీసు శాఖ పలు వ్యూహాలు అమలు చేయనుంది. దీని ద్వారా గంజాయి సాగు, సరఫరా, నిల్వ, వినియోగానికి సంబంధించిన కీలక హాట్‌స్పాట్‌ను జిల్లాల వారీగా మ్యాపింగ్‌ చేయనున్నారు. వాటి ఆధారంగా ఆయా ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగించి తనిఖీలు చేపట్టనున్నారు.

తొలుత సాగు లేకుండా చేస్తారు. ఆ తర్వాత సరఫరాను కట్టడి చేస్తారు. నిల్వ కేంద్రాలపై దాడులు చేస్తారు. విక్రయ, కొనుగోలుదారులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తారు. కేవలం గంజాయి, డ్రగ్స్‌ కట్టడి కోసమే ప్రత్యేకంగా పనిచేసేలా రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయిలో అదనపు ఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను పెట్టనున్నారు. వీటికి అనుబంధంగా యాంటీ డ్రగ్‌ స్క్వాడ్స్‌ పనిచేయనున్నాయి. ముందస్తు సమాచారాన్ని సేకరించి గంజాయి, డ్రగ్స్‌ స్థావరాలపై దాడులు చేయడం వీటి ప్రధాన విధి.

డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థి దశలో అవగాహన కల్పించాలి: మంత్రి సవిత - Awareness of Students on Drugs Use

ఇప్పటివరకూ నమోదు చేస్తున్న గంజాయి, డ్రగ్స్‌ కేసుల్లో ఎక్కువ శాతం కొరియర్లనే నిందితులుగా చేరుస్తున్నారు. దీంతో అమాయక గిరిజనులే బలైపోతున్నారు. అసలు కింగ్‌పిన్‌లను పట్టుకునేలా దర్యాప్తు సాగించట్లేదు. ఇకపై ప్రతి కేసులో పట్టుబడ్డ వారిని వెనక నుంచి నడిపిస్తున్నది ఎవరు? వారి వెనక ఉన్నది ఎవరు అనే లింక్‌ వెలికితీసి దాడులు చేపట్టనున్నారు. వారి ఆస్తులనూ జప్తు చేయనున్నారు. ప్రస్తుతం ఏవోబీ నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున గంజాయి ఏపీలోకి వస్తోంది.

దీన్ని కట్టడి చేసేందుకు సరిహద్దు చెక్‌పోస్టులను బలోపేతం చేయనున్నారు. ఫేషియల్‌ రికగ్నేషన్, ఆటోమేటిక్‌ నంబర్‌ డిటెక్షన్‌ వ్యవస్థలతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లర్లు, సరఫరాదారులు, కింగ్‌పిన్‌లకు శిక్షలు పడేలా చేయాలంటే కేసు నమోదు నుంచి సాంకేతిక ఆధారాల సమర్పణ వరకూ ప్రతి దశలోనూ ఆయా చట్టాలపై సిబ్బందికి సమగ్ర అవగాహన ఉండాలి. దీని కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

యువత మత్తుకు దూరంగా ఉండాలి - గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు: డీజీపీ - DGP Awareness on Drugs

ABOUT THE AUTHOR

...view details