KR Suryanarayana on Postal Ballot Votes : పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారులదేనని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు చెల్లకపోవడం ఎన్నికల ప్రక్రియలో లోపంగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి ఉద్యోగుల ఓటు హక్కు వినియోగంలో బాధ్యతగా ఉంటే ఆ ఓటు చెల్లదంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓటు హక్కు వినియోగాన్ని ఎందుకు ఇంత సంక్లిష్టంగా మారుస్తున్నారని మండిపడ్డారు.
సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సమంజసమేనా అని నిలదీశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశ చరిత్రలోనే పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో రికార్డు స్థాయిలో వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఓటు హక్కు చెల్లుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల అధికారులు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే ఆర్‌వోలదే బాధ్యత. ఉద్యోగుల ఓటు చెల్లకపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఉద్యోగుల ఓటు చెల్లుబాటు అయ్యేలా ఈసీ చూడాలి. ఉద్యోగుల ఓటు హక్కు వినియోగాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నారు. సాంకేతికత తెలిసిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సమంజసమేనా? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సరళతరం చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది.-కెఆర్సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత
రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు- జాప్యం లేకుండా ఫలితాలు : సీఈవో మీనా - CEO Mukesh Kumar Meena Inspected
స్పష్టత ఇచ్చిన ఈసీ : పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌పై ఎన్నికల అధికారి సీల్ లేకపోయినా సదరు బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏపై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సీపై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించ రాదని ఈసీ ఆదేశించింది.
పోస్టల్ ఓట్లపై ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు: ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారం పై ఎన్నికల అదనపు ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై గతంలో నిబంధనలు జారీ చేశారని, గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారని, స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అంటున్నారని వైఎస్సార్సీపీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆర్వో సీల్ లేకున్నా తిరస్కరించొద్దు - పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ క్లారిటీ - Postal Ballots Counting