Government Action Plan Ready For Road Repair : రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసిన ఫలితంగా నేడు ఎక్కడ చూసినా గుంతలు పడ్డ, దెబ్బతిన్నరోడ్లే కన్పిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి వీటి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది. యుద్ధప్రాతిపదికన గుంతలు పూడ్చే పనులు చేపట్టి, వాహనదారులకు తొలుత కొంత ఉపశమనం కలిగిస్తోంది.
దీర్ఘకాలిక లక్ష్యంతో రోడ్ల విస్తరణ, వంతెనలు, కల్వర్టులు తదితరాల నిర్మాణంపై వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన ప్రణాళికను సిద్ధం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2029-30 వరకు ఐదేళ్లలో 40,178 కి.మీ. మేర రోడ్లను గాడిలో పెట్టాలని, ఇందుకు రూ.43,173 కోట్ల వ్యయమవుతుందని ఇంజినీర్లు అంచనాలు రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవలే ఈ నివేదికను అందజేశారు.
విస్తరణ, పునరుద్ధరణకే అధిక నిధులు
- సాధారణంగా రోడ్లు నిర్మించాక ఐదేళ్లకోసారి వాటిని పునరుద్ధరించాలి. పై పొరను తొలగించి, కొత్త పొర వేయాలి. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఒకే ఒక్క ఏడాది, అదీ కొన్ని రోడ్లను మాత్రమే పునరుద్ధరించారు. వచ్చే ఐదేళ్లలో 21,743 కి.మీల మేర పునరుద్ధరణ పనులు చేయాలని, ఇందుకు రూ.12,805 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు.
- ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణకు కూడా గత ప్రభుత్వం పెద్దగా నిధులు ఇవ్వలేదు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) వంటివి రుణాలు ఇచ్చినా వాడుకోలేదు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే 8 వేల కి.మీ.ల మేర రోడ్లను విస్తరించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రాష్ట్ర రహదారులు రూ.2,500 కి.మీ.కాగా, జిల్లా రహదారులు 5,500 కి.మీ. మేర ఉన్నాయి. వీటి విస్తరణకు రూ.14,045 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు.
- ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట కాల్వల వెంబడి ఉండే రోడ్లు, అధిక లోడుతో వాహనాలు వెళ్లే రోడ్లు త్వరగా దెబ్బతింటాయి. వాటిని ఎప్పటికప్పుడు పటిష్ఠ పరచాల్సి ఉంది. ఇందుకోసం ఐదేళ్లలో రూ.8,196 కోట్లు వెచ్చించి, 9,375 కి.మీ. మేర కాల్వల వెంబడి రోడ్లను పటిష్ఠ పరచాలని నివేదికలో పేర్కొన్నారు.