Gold Rates Hike In Telangana : పెళ్లైనా, పేరంటమైనా లేక ఏ చిన్నపాటి వేడుకైనా సరే మహిళలు బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎవరికైనా బహుమతిగా పసిడి ఇస్తే దాన్ని తీసుకున్న వ్యక్తికి ఉండే ఆనందమే వేరు. మహిళలకే కాదు చిన్నారులు, పురుషులు సైతం బంగారు ఆభరణాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. తులాల కొద్ది గొలుసులు, ఉంగరాలను పెట్టుకునే మగవాళ్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. ఆలంకరణ కోసం కొందరు హోదాగా భావించి మరికొందరు పెట్టుబడిగా ఉంటుందని ఇంకొందరు ఇలా దాదాపు అందరి దృష్టి బంగారు, వెండి పైనే ఉంటుంది.
ఏటా పెరిగిపోతున్న పసిడి ధర :పసిడి ధర ఏటా పెరుగుతూ వస్తోంది. దశాబ్దం క్రితం రూ.28వేలున్న 24 క్యారెట్ల తులం బంగారం ఇప్పుడు దాదాపు 75వేల రూపాయల మధ్య కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయంలో బంగారం ధర రూ.61వేలు పలికింది. హైదరాబాద్‌లో 20 రోజుల క్రితం 72వేల 650 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు రూ.74500కు అటు ఇటుగా కొనసాగుతోంది. ఈ లెక్కన రూ.1800 పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిలో వెండి ధర కూడా దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు :మార్చి నెలలో కిలో వెండి 76వేల రూపాయలు పలికింది. బంగారంతో పాటు వెండి కూడా పెరగడం సర్వసాధారణం. బంగారం కొనే స్థోమత లేని వాళ్లు వెండిని కొని అలంకరించుకుంటారు. పసిడి, వెండి ధరలు పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణం. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ బాండ్లపై వడ్డీ రేట్లను కొన్ని నెలలుగా క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. దీంతో అమెరికన్‌వాసులు బాండ్లవైపు మొగ్గు చూపకుండా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు.
"బంగారం ఉత్పత్తి ప్రస్తుతం కొంత తగ్గింది. ముఖ్యంగా మైన్స్ తగ్గడం వల్ల బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం కూడా మరో కారణం. పెట్రోల్, డాలర్ ప్రభావం బంగారం ధరలపై ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల కూడా బంగారం ధరలు పెరిగేందకు అవకాశం ఏర్పడుతుంది"-ప్రతాప్, మార్కెట్ నిపుణులు