షేక్‌పేట్ నాలా సమస్యను పట్టించుకోనీ జీహెచ్ఎంసీ వర్షం వస్తే పరిస్థితులపై జంకుతున్న స్థానికులు (ETV Bharat) GHMC Negligence in Shaikpet Nala Development Works : 'నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దు - వర్షాలు రాకముందే కోర్ ఏరియాలను గుర్తించి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించండి' ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశిస్తూ చెప్పిన మాటలివి. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా నాలాల్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో కిలోమీటర్ల మేర స్తంభించిన మురుగు చుట్టుపక్కల భరించలేని దుర్వాసన. చూడటానికి భయంకరంగా ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్‌లోని షేక్‌పేట్ నాలా.
GHMC Negligence in Shaikpet Nala Development Works (ETV Bharat) షేక్‌పేట్ నుంచి ఫిల్మ్ నగర్ కొత్త చెరువు, మాసబ్‌ట్యాంకు మీదుగా హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుంది. 10 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నాలా నిర్వహణ లేక ఏళ్ల తరబడి స్థానికులు అవస్థలు పడుతున్నారు. సంవత్సరాల నుంచి దీని చుట్టపక్కల నివసిస్తున్న వారి బాధలు వర్ణణాతీతంగా మారాయి. చిన్నపాటి వర్షానికే నాలాలో ఎక్కడికక్కడే వరద నిలిచిపోయి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఫిల్మ్‌నగర్, మహాత్మాగాంధీ నగర్ మీదుగా వెళ్లే ఈ నాలా వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఎగువ నుంచి వరదతో పాటు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా కొట్టుకొచ్చాయి. విషయం తెలిసిన ఈటీవీ భారత్ బృందం సుమారు 10 కిలోమీటర్ల మేర నాలా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించగా, అక్కడి వారి దయనీయ పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపించింది.
Neglect of Authorities on Nala in Gajularamam : బాచుపల్లిలాంటి నాలాలు నగరంలో ఎన్నో.. ఆందోళనలో తల్లిదండ్రులు
మహాత్మాగాంధీ నగర్ నుంచి కిందకు వెళ్లే కొద్దీ నాలా పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. వంతెనల పక్కన గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. నాలాలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, దానికి తోడు కొందరు స్థానికులు చెత్తా చెదారం వేయడం వల్ల నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మురుగు నీరు నివాసాల ముందే నిల్వ ఉండటం వల్ల భరించలేని దుర్వాసనతోనే సావాసం చేస్తున్నామని బస్తీవాసులు వాపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
"వర్షం వస్తే నీరంతా ఇక్కడికే వస్తుంది. నాలాలు నిండి ఆ నీరంతా ఇళ్లలోకి వస్తుంది. నాలా నుంచి వచ్చే వాసనకు చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. డెంగీ, మలేరియా వంటి అన్ని రోగాలు చుట్టుముడతాయి. జీహెచ్ఎంసీ వారికి ఫిర్యాదు చేసినప్పుడల్లా వచ్చి ఏదో చేసి వెళ్లిపోతారు కానీ పూర్తిగా చేయరు. చెత్త తీస్తారు, ఇక్కడే కుప్పలు పెట్టి పోతారు. దాన్ని తీయరు. మళ్లీ వర్షం వచ్చినప్పుడు అదంతా అందులోనే కలిసిపోతుంది. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి నాలాపై చర్యలు చేపట్టాలి." - స్థానికులు
హెచ్చరికలను పక్కన పెడుతున్న బల్దియా :నాలా పరివాహకం వెంట ఇరుకైన ప్రదేశంలో జీవిస్తున్న బస్తీ వాసులు రాకపోకలు సాగించేందుకు ఇనుప వంతెన ఏర్పాటు చేసుకున్నారు. అది పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఇటీవల వరద తాకిడికి ఆ వంతెనపై నడుస్తున్న ఇద్దరు నాలాలో పడిపోయారని స్థానికులు తెలిపారు. నాలా గోడలు సైతం అక్కడక్కడ దెబ్బతిని మురుగునీరు బయటికి ప్రవహిస్తోంది. వానాకాలం ముందే నాలాలో పూడికతీత పూర్తి చేయాల్సి ఉన్నా, ఆ దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఈసారి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను బల్దియా పెడచెవిన పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లుగా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే నాథుడే కరవయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టన్నుల కొద్దీ చెత్తను తీయడానికి ఇద్దరు :నాలాను ఈటీవీ భారత్ బృందం పరిశీలిస్తున్న విషయం తెలుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, హుటాహుటిన అక్కడికి చేరుకుని వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేశారు. టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించేందుకు ఇద్దరిని నియమించడంపై బస్తీవాసులు పెదవి విరిచారు. తూతూ మంత్రంగా కొంత తీసి ఒడ్డున పడేశారని ఆరోపిస్తున్నారు. నాలాల్లో పూడిక, వ్యర్థాల తొలగింపు గుత్తేదారులకు సవాల్‌గా మారింది. బురద పేరుకుపోయి ఉండటం, వ్యర్థాల్లో గృహోపకరణాలు సహా రకరకాల వస్తువులు ఎక్కువగా ఉండటం, తీవ్ర దుర్గంధం వల్ల తీయడానికి కూలీలు సాహసం చేయడం లేదు. జేసీబీల సహాయంతో తీద్దామంటే ఇరుకైన సందుల్లో వాహనాలు వెళ్లే మార్గం లేదని గుత్తేదారులు చెబుతున్నారు.
Prathidwani : ప్రాణాంతకంగా మారుతున్న నాలాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు
Rain Problems in Hyderabad : ఆగని వానలు.. నీట మునుగుతున్న కాలనీలు