GHMC Mayor Joined Congress Today: సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడితుండటంతో అధిష్ఠానం అయోమయంలో పడింది. ఇప్పటికే పలువురు కీలక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. తాజాగా ఆ జాబితాలో రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య చేరారు. వీరంతా తాజాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దృష్ట్యా, మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ గూటికి జితేందర్ రెడ్డి - కేబినెట్ హోదా ఇచ్చిన అధిష్ఠానం
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు : ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ విజయలక్ష్మికి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కూడా కాంగ్రెస్‌తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.