GHMC Council Meeting 2024 : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో(GHMC Council Meet) పనిచేస్తున్న అధికారులపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. హైకోర్టు ఆదేశాలతో ఆరు నెలల తర్వాత సమావేశాన్ని నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్ కార్పొరేటర్ల సమస్యలపై చర్చించారు. అధికార కాంగ్రెస్ కార్పొరేటర్లతోపాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు.
GHMC Council Meeting Today :సమావేశానికి ముందు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో మొత్తం 29 సమస్యలనుగాను మూడు సమస్యలపైనే సభలో జోరుగా చర్చ జరిగింది. జీహెచ్ఎంసీలో ఉన్న అధికారులు ఎవరిని లెక్క చేయడం లేదని, కొంత మంది అధికారుల అక్రమార్జనకు ఆసరాగా జీహెచ్ఎంసీ పనిచేస్తుందని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ఆరోపించారు.
జీతం పడగానే ఒక్కో కార్మికుడి నుంచి రూ.500 వసూలు - బల్దియాలో ఫీల్డ్ అసిస్టెంట్ల అరాచకాలు!
Clash in GHMC Council Meet 2024 :డిప్యూటేషన్‌పై జీహెచ్ఎంసీకి అధికారులు క్యూ కడుతున్నారని, ఏళ్ల తరబడి ఒకే స్థానంలో అధికారులు పాతుకుపోయారని విమర్శించారు. తమ పలుకుబడితో వందల కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించిన శ్రావణ్, జీహెచ్ఎంసీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. శ్రావణ్ ఆరోపణలపై స్పందించిన కమిషనర్ రోనాల్డ్ రాస్, జీహెచ్ఎంసీలో 312 మంది అధికారులు డిప్యుటేషన్ లో ఉన్నారని, 45 మంది రిటైర్డ్ అయిన వాళ్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
వారిపై త్వరలోనే చర్యలు ఉంటాయని రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆ తర్వాత వీధి దీపాల అంశంపై కూడా సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రసంగిస్తూ, జీహెచ్ఎంసీలో 5 నెలలుగా వీధి దీపాల పునరుద్దరణ వ్యవస్థ ఆగిపోయిందని, అవి లేకపోవడం వల్ల నగరంలో నేరాల సంఖ్య పెరుగుతుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులను, వ్యవస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసిందని, ప్రభుత్వం మారగానే సమస్యలు గుర్తుకు వచ్చాయా అంటూ మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.