GHMC Commissioner On Tender process In Hyderabad : నిధులు పూర్థి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా కమిషనర్ ఇలంబర్తి ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉత్తర్వు ప్రకారం టెండరు ప్రక్రియ పూర్తయిన రెండేళ్లకు కూడా మొదలుకాని పనులు వాటంతట అవే రద్దయిపోతాయి. ఇంజినీర్ల మద్దతుతో కొందరు గుత్తేదారులు ఏళ్ల తరబడి పనులు ప్రారంభించకుండా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారిపై ఈ నిర్ణయం చెంపపెట్టులాంటిది.
కనీసం 80 శాతం ప్రజలకు చేరాలి : ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బులో కనీసం 80 శాతం ప్రజలకు చేరాలన్న లక్ష్యంతో సంస్కరణలు చేపట్టినట్లు కమిషనర్ ఇలంబర్తి చెబుతున్నారు. ఆయన ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నారు.
పరిశీలించాకే బిల్లుల ఆమోదం : పనులు మూడో ఏడాదికి కూడా పూర్తవ్వకపోతే ఆ తర్వాతి బిల్లులు జోనల్ స్థాయి కమిటీ పరిశీలించాకే ఆమోదం పొందుతాయి. దానికి ముందు కమిటీలోని అధికారులు చేసిన పనులను తనిఖీ చేస్తారు. కమిటీకి అఖిల భారత సర్వీసు స్థాయి అధికారి ఛైర్మన్‌గా, ముఖ్య ఇంజినీరు కన్వీనరుగా, జోనల్ కమిషనర్లు, వేర్వేరు స్థాయిల్లోని ఇంజినీర్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు.