GHMC BRS Corporators Joining in Congress :గ్రేటర్ హైదరాబాద్‌లో అధికార, విపక్ష పార్టీల లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలో ఊహించని ఫలితాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గట్టిగానే గురిపెట్టింది. ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో మంతనాలు సాగిస్తూ బీఆర్ఎస్ను బలహీనపర్చేందుకు పావులు కదుపుతోంది.
2020లో గ్రేటర్‌లోని 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ - 55, బీజేపీ - 48, ఎంఐఎం - 44 డివిజన్లలో గెలుపొందాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఏఎస్ రావు నగర్, ఉప్పల్, లింగోజిగూడ ఈ 3 చోట్ల మాత్రమే గెలిచింది. అందులో ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ బీఆర్ఎస్లోకి వెళ్లడంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 2కు పడిపోయింది.
56 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. బల్దియాపై పూర్తి పట్టు కోల్పోయిన కాంగ్రెస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్లో ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 29 స్థానాలకు మూడింట మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల టికెట్లు ఆశించి భంగపడ్డారు. దాంతో కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నా గెలవలేకపోయారు.
కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న వలసలు - బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా
ఈ పరిణామాలతో లోక్‌సభ ఎన్నికల్లోపు గ్రేటర్లో పార్టీని బలోపేతం చేసుకోకపోతే 4 ఎంపీ స్థానాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేశారు. అందుకే ముందస్తుగా బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ తలుపులు తెరిచారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్, మాదాపూర్, హఫీజ్ పేట, రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ల చేరికతో బల్దియాలో కాంగ్రెస్‌కు 6 సీట్లు (Congress Joinings) పెరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ స్థాయిల్లో ఉన్న అగ్రనేతల సంప్రదింపులు, బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు ఆయన సతీమణి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి హస్తం గూటికి చేరారు.
అలాగే బోరబండ బీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పది రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతతో పాటు (Corporator Mothe Srilatha) బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు శోభన్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో గ్రేటర్లో బీఆర్ఎస్ తేనెతుట్టె మరోసారి కదిలినట్టైంది. ఆరుగురు కార్పొరేటర్లు కాస్తా ఇప్పుడు తొమ్మిది మందయ్యారు.