Leaning Building Demolish at Gachibowli :హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌లో ఒరిగిన నాలుగంతస్థుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే భవనాన్ని కూల్చివేసేందుకు అక్కడ హైడ్రాలిక్ యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారు. అంతకముందు ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు. సిద్ధిఖీనగర్‌లో 50 గజాల్లో నిర్మించిన భవనం మంగళవారం రాత్రి ఒక్కసారి ఒకపక్క ఒరిగి భయాందోళన సృష్టించింది.
గత మూడు రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున గుంతల తవ్వకం కొనసాగించడంతో ఫలితంగా మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా ఒక పక్కకు ఒరిగింది. అందులోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగు తీయగా మూడో అంతస్థులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకారు. దీంతో తీవ్రంగా గాయపడ్డిన ఆ వ్యక్తిని అక్కడున్న స్థానికులు ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పరిహారం ఇప్పించాలి : పక్కన మరో బిల్డింగ్ నిర్మాణానికి గుంతలు తవ్వడంతోనే తమ భవనం పక్కకు ఒరిగిందని యజమానురాలు స్వప్న తెలిపారు. ఈ ఇల్లు రెండేళ్ల క్రితమే నిర్మించామని, మంగళవారం రాత్రి పక్కకి ఒరగడంతో అందులోని అందరం ఖాళీ చేశామని వివరించారు. భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది ఉంటుందనే తొలగించేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు. కూల్చివేసేందుకు తాము అంగీకరిస్తామని, కానీ పక్క భవనం యజమానితో పరిహారం ఇప్పించాలని కోరారు. ఊరిలో పొలం అమ్మి అప్పు చేసి ఇల్లు కట్టామని, ఇది కోల్పోతే తమ పిల్లల భవిష్యత్తేంటని ఆవేదన వ్యక్తం చేశారు. భవనం కూల్చివేతతో తనతో పాటు తన పిల్లలు రోడ్డున పడతారని వాపోయారు.
మరోవైపు సిద్దిఖీనగర్‌లో సామర్థ్యానికి మించి అనేక బిల్డింగ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపడతామని తెలిపారు. భవనం ఒరగడానికి కారణమైన పక్క స్థలం యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం - స్థానికుల్లో టెన్షన్ టెన్షన్