National Academy of Agricultural Research Management : ఆ కాలేజీలో సీటోస్తే చాలు నీ జీవితం చాలా బాగుంటుంది అని పెద్దవాళ్లు మనల్నీ అంటుంటారు.ఈ మాటలకు ఉదాహరణగా నిలుస్తోంది నార్మ్. సీటొస్తే చాలు మంచి వేతనాలతో ఉద్యోగం లభిస్తోంది. కోర్సులో చేరిన విద్యార్థులు కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తుంటారు. ఇదీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్) ప్రత్యేకత.
ఇక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఏబీఎం) కోర్సును పూర్తిచేసినవారు వంద శాతం ఉద్యోగాలు పొందుతున్నారు. రెండేళ్ల కోర్సులో మొదటి ఏడాది పూర్తవగానే విద్యార్థులకు ప్రాంగణ నియామకాల అవకాశాలు వస్తున్నాయి. ఏఐసీటీఈతో పాటు న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటెషన్ కౌన్సిల్) గుర్తింపుపొందిన ఈ వ్యవసాయ అనుబంధ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది.
వ్యవసాయ పరిశోధనలో ఉత్తమం :భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్)కి అనుబంధంగా వ్యవసాయ పరిశోధన విద్యా నిర్వహణకు సంబంధించి నార్మ్ 1976లో ఏర్పాటయింది. వ్యవసాయ పరిశోధనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం, సలహాలను అందించడంతో పాటు రైతులు, శాస్త్రవేత్తలతో సహా వివిధ వాటాదారులకు పేటెంట్లు మొదలైనవి లభించేందుకు నార్మ్ కృషి చేస్తోంది.
NATIONAL AGRICULTURE RESAERCH MANAGAMMENT (ETV Bharat) వ్యవసాయం, అనుబంధ రంగాలతో పారిశ్రామిక, వ్యాపార రంగాల అధ్యయనాలను సమ్మిళితం చేసి సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు సాధించేందుకు, విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా 2009లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ప్రారంభించింది. 2019 వరకు ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ అగ్రికల్చర్ (పీజీడీఎంఏ) పేరుతో ఉండేది. 2020 లో దాన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఏబీఎం)గా పేరు మార్పు చేసి నిర్వహిస్తున్నారు.
ప్రతిభావంతులకు పట్టం :బీఎస్సీ అగ్రికల్చర్, హర్టికల్చర్, వెటర్నరీ, ఫీషరీస్ సైన్స్ నాలుగేళ్ల కోర్సులలో ఏదైనా ఓ శాఖ నుంచి ఉత్తీర్ణులైన వారు క్యాట్, సీమాట్ పరీక్షలు రాయాలి. అర్హత సాధించినవారు నార్మ్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటారు. పీజీడీఎం-ఎంబీఎంలో 60 సీట్లు ఉన్నాయి. వీటి కోసం ఏటా వెయ్యిమందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు. ఆయా అభ్యర్థులకు ఎనలిటికల్ రైటింగ్‌స్కిల్స్ టెస్ట్, గ్రూప్ డిస్కర్షన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అందులో ప్రతిభ చూపినవారికే ప్రవేశాలు కల్పిస్తారు. కేంద్రీయ విద్యాసంస్థల మాదిరే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.
ప్రవేశాలు పొందినవారికి ఒక్కో విద్యార్థికి ఒక్కో గది చొప్పున హాస్టల్లో వసతి ఉంటుంది. విశాలమైన తరగతి గదులుంటాయి. జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. బోధకుల్లో 70 శాతం మంది శాస్త్రవేత్తలు, నిపుణులు ఉండగా, 30శాతం మంది పారిశ్రామికరంగం నుంచి వచ్చి బోధన చేస్తారు. విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలతో పాటు అసైన్‌మెంట్లు, కేస్ స్టడీస్, ఇంటర్వ్యూ చర్చలు, పారిశ్రామిక ప్రముఖులతో భేటీలు, క్షేత్రస్థాయి పరిశీలనలు వంటివి ఉంటాయి.
సెమినార్లు, వర్క్‌షాపులు, సింపోజియాలలోనూ పాల్గొంటారు. ఈ చదువు రెండేళ్ల కోర్సులో ఆరు ట్రిమిస్టర్లు ఉంటాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇంటర్న్‌షిప్, మేనేజ్‌మెంట్, ప్రజెంటేషన్ స్కిల్స్, సప్లైచెయిన్, రాజకీయ, ఆర్థిక తరగతులు వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.
- మూడో ట్రిమిస్టర్ నుంచే పలు రకాల కంపెనీలు నార్మ్‌కు వచ్చి విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కి ఎంపిక చేసుకుంటున్నాయి. ఐదో ట్రిమిస్టర్‌లోనూ మళ్లీ కంపెనీలు వచ్చి ఇంటర్న్‌షిప్ అవకాశం ఇస్తున్నాయి. అది పూర్తయిన వెంటనే ప్రాంగణ నియామకాలు(క్యాంపస్ రిక్రూట్మెంట్స్) మొదలవుతున్నాయి. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కంపెనీలే సగానికి పైగా ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. మిగిలినవారికి ఇతర కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి.
- వ్యవసాయ, విత్తన, పురుగుమందులు, ఎరువులు, పశువైద్య, మత్స్య, జీవశాస్త్ర, బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, వాణిజ్య సంస్థలు, గృహోపకరణాలు, అగ్రిటెక్ తదితర రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇంతవరకు నియమితులైనవారికి సగటున రూ.10 లక్షల 70వేల ప్యాకేజీ ఉంది. గత ఏడాది అత్యధికంగా రూ.15 లక్షల ప్యాకేజీ సాధించారు. నార్మ్‌లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థుల్లో 50శాతం అమ్మాయిలే ఉంటున్నారు.
సీట్ల సంఖ్య రెట్టింపునకు యోచన :మా విద్యార్థులు మంచి ప్రతిభావంతులు. 15 ఏళ్లలో ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ప్రాంగణ నియామకాల్లో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఈ కోర్సుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సీట్ల సంఖ్యను 120కి పెంచాలని ఆలోచిస్తున్నామని నార్మ్ ప్రాంగణ నియామకాల కోఆర్డినేటర్ గణేశ్‌కుమార్ తెలిపారు. క్రమశిక్షణతో పాటు పర్యావరణ సానుకూల వాతావరణంలో తరగతులు సాగుతున్నాయి. ఉద్యోగాలు పొందిన వారు వ్యవసాయ రంగానికి గణనీయమైన సేవలందిస్తున్నారని చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనీజా తెలిపారు.
అశ్రితారెడ్డి, నార్మ్‌లో విద్యార్థి (ETV Bharat) రెండేళ్ల కోర్సులో మొదటి ఏడాదిలోనే చక్కటి పరిజ్ఞానం పొందాను. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా చేయవచ్చో తెలుసుకున్నాను. కోర్సు పూర్తయ్యాక దీన్ని ఆచరణాత్మకంగా చూపుతాను.
-అశ్రితారెడ్డి, గుండారం, సిద్దిపేట జిల్లా నార్మ్‌లో విద్యార్థి