GANJA QUEEN NEETU BAI FROM DHOOLPET:రోజూ కనీసం 2 నుంచి 4 లక్షల రూపాయల విక్రయాలు. కోట్ల రూపాయల ఆస్తులు. వీటన్నింటికీ మించి పదుల సంఖ్యలో కేసులు. ఇదంతా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ గురించి అనుకుంటే పొరబాటే. గంజాయి విక్రయాల్లో ఆరితేరిన ఓ మహిళ స్టోరీ ఇది. ఎక్సైజ్ టీమ్‌లు ఇప్పుడు ఈ గంజాయి క్వీన్ నీతూబాయి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ధూల్‌పేటలో గంజాయి విక్రయాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ధూల్‌పేట’లో భాగంగా ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు. అదే విధంగా గంజాయి సిండికేట్‌లో సభ్యురాలైన అంగూరీబాయిని 5 రోజుల క్రితం అరెస్టు చేశారు.
అంతటితో ఆగకుండా మంగళవారం సాయంత్రం అంగూరీబాయి మేనల్లుడు శుభంసింగ్‌ను సైతం అరెస్టుచేశారు. దర్యాప్తులో భాగంగా అతడిని ప్రశ్నించినప్పుడు నానక్‌రామ్‌గూడకు చెందిన నీతూబాయి పేరు బయటకొచ్చింది. నానక్‌రాంగూడ లోథాబస్తీకి చెందిన కాలావతి నీతూబాయి పుట్టి పెరిగింది మొత్తం ధూల్‌పేటలోనే. గతంలో గుడుంబా వ్యాపారం చేసేవారు. అయితే ప్రభుత్వ చర్యలతో అది వదిలేసి క్రమంగా గంజాయివైపు మళ్లారు.
ఫ్యామిలీ మొత్తం ఇదే దందా: నీతూబాయితో పాటు ఆమె భర్త మున్నూసింగ్, ఇద్దరు కుమారులు, బంధువులు అందరిదీ ఇదే దందా. అంగూరీ బాయి నీతూబాయికి బంధువు కావడం గమనార్హం. నీతూబాయి రోజూ సగటున 2 నుంచి 4 లక్షల రూపాయల సరకు అమ్ముతోంది. ఒడిశాలో కిలో గంజాయి 8 వేల రూపాయలకు కొని 5, 10 గ్రాములుగా సెపరేట్ చేసి చిన్నచిన్న పొట్లాల్లో నింపుతారు. 5 గ్రాముల పొట్లాన్ని 500 రూపాయలకి విక్రయిస్తారు. నానక్‌రాంగూడ పక్కనే ఐటీ కారిడార్ ఉండటంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు గంజాయి కొనేందుకు వస్తుంటారని చెబుతున్నారు.