Ganesh Chaturthi Celebrations In Telangana :రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వాడవాడనా, వీధివీధినా ప్రతిష్టించిన లంబోదరుడికి భక్తి ప్రపత్తులతో నిత్య పూజలు చేస్తున్నారు. పార్వతి తనయుడికి ఇష్టమైన రోజుకో ప్రత్యేక వంటకాలతో నైవేద్యం సమర్పిస్తున్నారు. నవరాత్రులు ముగింపు దశకు వస్తున్న వేళ ఎక్కడికక్కడ అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు సైతం శోభాయాత్రలతో హోరెత్తిస్తుండగా పలు చోట్ల మతసామరస్యం వెల్లివిరిసింది.
అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి వేడుకలు : హైదరాబాద్‌లో వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో లంబోదరుడికి పూజలు చేస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. అన్నప్రసాద వితరణలు, భజన కార్యక్రమాలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది.
నృత్యంతో అదరగొట్టిన 78 ఏళ్ల బామ్మ : సనత్‌నగర్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో గణేశుడి ముందు ఓ 78 ఏళ్ల బామ్మ నృత్యంతో అదరగొట్టింది. టిక్‌టాక్ బామ్మగా పిలుచుకునే విజయలక్ష్మికి 80వేల అభిమానులుండేవారు. టిక్‌టాక్ బ్యాన్ చేసిన అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన విజయయలక్ష్మి బామ్మకు 22వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో మత సామరస్యం వెల్లివిరిసింది. స్థానిక ముస్లింలు ఓ గణేశ్ నిమజ్జనంలో వేడుకల్లో పాల్గొని ఆడిపాడారు.
గణనాథుడికి భక్తుల జేజేలు :రాష్ట్రంలోని జిల్లాల్లో గణనాథుడికి భక్తులు జేజేలు పలుకుతున్నారు. ఊరువాడా మండపాల వద్దకు చేరి విఘ్నాలు తొలగించమంటూ విఘ్నేష్వరుడిని వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గడ్డెన్నవాగు వద్ద ఏర్పాట్లను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తదితరులు పరిశీలించారు. నిమజ్జన యాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 600మంది పోలీసులు దాదాపు 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎద్దుల బండిపై నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుంది.