Free Skill Training In Solar Installation : భవిష్యత్‌లో ప్రపంచమంతా హరిత ఇంధనం వైపు పరుగులు తీస్తోంది. ఈ రంగంలో భారీ ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు దేశంలో నైపుణ్యాలు లేని కారణంగా నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారు. ఈ రెండింటిని సమతుల్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు కంపెనీలు యువతకు ఉచిత శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
నిరుద్యోగ యువతకు రెడ్డీస్ ల్యాబ్ ఉచిత శిక్షణ :గ్రీన్ ఎనర్జీ రంగంలోని ఉపాధి అవకాశాలను గ్రామీణ యువతీ యువకులకు అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ముందుకు వచ్చింది. కరీంనగర్ వేదికగా యువతకు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్, సమస్య పరిష్కారాలపై ఉచిత శిక్షణ ఇస్తోంది. 18 నుంచి 28ఏళ్ల లోపు ఉండి ఉద్యోగం రాక సతమతమవుతోన్న వారికి 3 నెలలు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. రెండు నెలలు థియరీ, నెలరోజులు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది రెడ్డీస్ ల్యాబ్ ఫౌండేషన్. ఇప్పటికే శిక్షణ తీసుకున్న వారిలో 75% మంది ఉద్యోగం పొందారు. దాంతో ఈ శిక్షణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువతీ యువకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సమాచారం తెలుసుకుని ఆసక్తితో చేరినట్లు శిక్షణలో ఉన్న యువత చెబుతున్నారు .
సోలార్ ఫ్యానల్ ఇన్స్టాలేషన్ :సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ శిక్షణలో భాగంగా సౌర విద్యుత్‌ను ఎలా తయారు చేస్తారు? ఎలా ఏర్పాటు చెయ్యాలి? వీటి సూత్రాలు ఏమిటి? అన్నవాటిపై నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. సాంకేతిక వివరాలు బోధిస్తున్నారు. బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంటర్వ్యూలకు ఎలా హాజరు కావాలనే అంశాలపై మెలకువలు చెబుతున్నారు. ఇవి తమ భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగ పడుతాయని విద్యార్థులు చెబుతున్నారు.