Fraud in khammam Mirchi Market : ప్రకృతి విపత్తులు, నకిలీ విత్తనాలు, ఎరువుల మాయాజాలాన్ని తట్టుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతు జేబుకు చిల్లు పెడుతున్నారు. మొదట ఒక రేటుకు బేరమాడి, కాంటా వేసే సమయానికి కుంటి సాకులు చెబుతూ భారీగా ధర తగ్గిస్తుండటంతో మిర్చి రైతు కుదేలవుతున్నాడు. ఖమ్మం మిర్చి మార్కెట్‌కు కొద్దిరోజులుగా లక్షల్లో మిరప బస్తాలు తరలివస్తున్నాయి. దేశీయంగా మంచి పేరు ఉండటంతో రాజస్థాన్(Rajasthan), బెంగాల్, విదేశాల నుంచి సైతం వ్యాపారులు వస్తుండటంతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
ఇదే అదునుగా దళారులంతా సిండికేట్‌గా మారి జెండా పాటను తగ్గిస్తున్నారు. గత వారంలో రూ. 25 వేలు జెండా పాట ఉండగా సోమవారం ఒక్కసారిగా రూ. 20 వేల 800కు తగ్గించారు. వ్యాపారులు తమను మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ధర తగ్గించడమే కాకుండా ఖమ్మం మార్కెట్ మరో దగాకు తెరలేపారు. మొదట కమీషన్ ఏజెంట్ తీసుకొచ్చిన వ్యాపారి, మిర్చి బస్తాను కోసి నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తాడు. కొద్దిసేపటి తర్వాత కాంటా వేయడానికి వచ్చిన వ్యాపారి తరఫు సిబ్బంది ఐదారు బస్తాలు కోసి మిచ్చి నాణ్యంగా లేదంటూ మరో వెయ్యి వరకు ధర తగ్గిస్తున్నారు. ఓ వ్యాపారి బేరం ఆడిన తర్వాత మరో వ్యాపారి కొనేందుకు ముందుకు రావట్లేదు.
'ఇవాళ మిర్చి ధర 20 వేల 800 ఉన్నది. గత వారం రోజుల ముందు అయితే రూ. 22,450 ఉండేది. ఎలాంటిసరుకు తెచ్చిన ఇరవై వేలపైనే అమ్ముడుపోయింది. గత వారంతో పోలిస్తే ఈ వారం 1500 వందల నుంచి రెండు వేలు దాకా తగ్గింది. ధర తగ్గడానికి కారణాలేంటో తెలియడం లేదు'-రైతులు