Fourth City in Hyderabad : నాలుగో నగరంలో ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ల నిర్మాణమంతా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణమిత్రగా రూపొందించనుంది. రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకోనున్న తొలి నెట్ జీరో సిటీ ఇదేనంటా. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, విద్యుత్, పురపాలక, భవనాలు, రహదారులు, టీజీఐఐసీ శాఖలకు బాధ్యతలు అప్పగించింది.
నాలుగో నగరానికి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఓఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరికంచె, మీర్‌ఖాన్‌పేట్, ముచ్చెర్ల వరకు 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారుల డిజైన్లను రూపొందించారు. రావిర్యాల ఓఆర్‌ఆర్ నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్‌గల్ మండలం ఆకుతోటపల్లె వద్ద ప్రాంతీయ రింగ్ రోడ్డును కలుపుతూ 40 కి.మీ. రహదారిని నిర్మిస్తారు. దీంతో పాటు రాజేంద్రనగర్‌లోని కొత్త హైకోర్టు నుంచి నాలుగో మహానగరం వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
రాజధానికి సమీపంలో కాలుష్య రహితంగా :చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ఆహ్లాదాన్ని పంచే మేఘాలు, కనిపించే వాతావరణ, వాణిజ్య క్లస్టర్లు, ప్రణాళిక బద్ధంగా నివాస ప్రాంతాలు, బహుళ జాతి సంస్థలు ఒక చోట, వీటన్నింటికీ దూరంగా పరిశ్రమలు, ఇలా నాలుగో మహానగరం కాలుష్య రహితంగా సిద్ధం కానుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగరికంచె, మీర్‌ఖాన్ గ్రామాల్లోని 4 వేల ఎకరాల్లో నెట్ జీరో సిటీని నిర్మించనున్నారు. వచ్చే 50 ఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలను ఇప్పటికే రూపొందించారు. వాతావరణం కలుషితం కాకుండా మార్గదర్శకాలు తయారు చేశారు. నాలుగేళ్లలో దశల వారీగా ఈ సిటీని అందుబాటులోకి తేనున్నారు.
ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్సెస్‌కు ప్రాధాన్యం :ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్ సైన్సెస్ హబ్ కోసం 4,207 ఎకరాలను కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలను స్థాపించేందుకు విదేశీ సంస్థలు ఒకవైపు నుంచి ఆసక్తి చూపిస్తున్నాయి. కొంగరకలాన్‌లో ఆపిల్ ఫోన్ విడి భాగాలను తయారు చేస్తున్న ఫాక్స్ కాన్ సంస్థ, ఎలక్ట్రానిక్స్ జోన్‌లో తన శాఖలను ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది.