Four Years Child Died in khammam :గ్రూప్-3 పరీక్షలు రాసేందుకు వెళ్లిన తల్లి తిరిగి ఇంటికి రావడం చూసిన ఓ చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబురపడింది. మమ్మీ అంటూ ఆమెను హత్తుకునేందుకు గుమ్మంవైపు పరుగులు తీసింది. తల్లి కూడా కుమార్తెను చూస్తూ రా..రా అంటూ చేతులు చాచింది. కానీ అమ్మ దగ్గరకు చేరేలోపే ఆ పాప ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ఖమ్మం గ్రామీణ మండల పరిధిలో చోటుచేసుకుంది. తల్లితండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లాలోని ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక(4).
అమ్మొచ్చేసిందంటూ తల్లి దగ్గరకు పరుగెత్తింది - చేరేలోపే ఆ చిన్నారి ప్రాణాలొదిలింది - FOUR YEARS GIRL DIED
ఖమ్మం జిల్లాలో విషాద ఘటన - పరీక్ష రాసి ఇంటికొచ్చిన తల్లిని చూసి అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లిన చిన్నారి - చేరేలోపే ప్రాణాలొదిలి అనంతలోకాలకు
Published : Nov 19, 2024, 7:53 AM IST
సోమవారం గ్రూప్-3 పరీక్షలు రాసేందుకు తల్లి లావణ్య వెళ్లగా, చిన్నారి ప్రహర్షిక నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. పరీక్ష అనంతరం మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిని చూసి ప్రహర్షిక పరిగెత్తుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఏమైందని తల్లి ప్రశ్నించగా, ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు చెప్పారు. ఎప్పుడూ చలాకీగా ఉండే కుమార్తె ఉన్నట్టుండి ప్రాణాలు విడిచిపెట్టడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి ప్రహర్షిక గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు.