Danger with Manja Thread :గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాలను వాడటం వల్ల ఈ మధ్య తీవ్ర అనర్థాలకు కారణమవుతుంది. పక్షుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అలాగే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు యమపాశంలా చుట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే గాలిపటాలు ఎగురవేసి దానికున్న మాంజాలు రోడ్లపై వదిలేసి వెళ్లిపోతుంటారు కొంతమంది. దాంతో అవి అందరికీ ఇబ్బంది కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉన్నా సరే కంటికి కనిపించకుండా గొంతును భాగాన్ని తీవ్రంగా గాయపరుస్తాయి. ఇలా మరణించిన వారు కూడా లేకపోలేదు.
నలుగురికి గాయాలు : ద్విచక్రవాహనంపై వెళ్తున్న నలుగురు యువకులకు మాంజా దారం తగలి గాయాల పాలైన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం (డిసెంబరు 29)న చోటు చేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఎస్.సనత్‌కుమార్, సాయిరాం, సాయికుమార్‌లు జనగామలోని సిద్జిపేట రోడ్డు వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా రైల్వే వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాలి పటానికి సంబంధించిన చైనా మాంజా దారం బైక్‌పై ప్రయాణిస్తున్న సనత్‌కుమార్ గొంతుకు తగలడంతో అతనికి తీవ్ర గాయమైంది. బండి అదుపుతప్పి కిందపడింది. బైక్‌పై ఉన్న అతని స్నేహితులు సాయిరాం, సాయికుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. సనత్‌కుమార్‌ను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.