Venkaiah Naidu felicitate Civils Rankers of KPIAS : భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు మాత్రమే లభిస్తుందని, దాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ శిక్షణతో సివిల్స్ ర్యాంకులు సాధించిన 35 మందిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు. ర్యాంకర్లు అందరికీ వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మరో గౌరవ అతిథిగా దూరదర్శన్ మాజీ అదనపు డీజీ డాక్టర్ ఆర్‌ఏ పద్మనాభరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మీ ఈ పయనం మీ జీవితాన్నే కాదు, ఈ దేశాన్నే మారుస్తుందని తెలిపారు. సమాజం, ప్రజలు, దేశం అన్నింటిలో పరివర్తన తీసుకొస్తుందన్నారు. ఎంపికైన మీది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశమని కొనియాడారు. కుల, మత, లింగపరమైన విభేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ భారతీయులేనని, ఇక్కడ వేర్వేరు మతాలు, సంస్కృతులు, భాషలు, దేవుళ్లు ఉండొచ్చుకానీ మనమంతా భారతీయులమని అన్నారు.
'మీ నిబద్దతే మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మీ మీద బోలెడు ఒత్తిళ్లు ఉంటాయి. రాజకీయ బాస్‌లు ఉంటారు. కానీ మీకు అసలైన బాస్ ఎవరంటే దేశ ప్రజలే. అసలై భగవద్గీత, బైబిల్ లేదా ఖురాన్ భారత రాజ్యాంగమేనని గుర్తించుకోవాలి. మీ మనస్సాక్షికే కట్టుబడి ఉండాలి. నిజాయతీతో ఉండాలి. ప్రభుత్వాన్ని మీరే ప్రతిబింబిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్రధాని ఎవరైనా ఉండొచ్చుగానీ, సేవలన్నీ అందేది మీ ద్వారా మాత్రమే. అత్యున్నత నైతిక విలువలను పాటించాలి. స్వాతంత్య్రం తర్వాత అన్ని స్థాయిల్లోనూ విలువలు కొంత పడిపోతూ వస్తున్నాయి. కానీ ఇప్పటికీ విద్య, వైద్యం, పాలనాయంత్రాంగం మాత్రం అచలంగా ఉన్నాయి. మీకు జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం వీటన్నింటినీ ప్రతి ఒక్కరు తప్పక గుర్తుంచుకోవాలని' మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.