Gang Selling Children Arrested in Hyderabad : చైతన్యపురిలో చిన్నపిల్లను అమ్ముతున్న ముఠా బండాగారం బట్టబయలైంది. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు, మల్కాజ్గిరి ఎస్‌వోటీ సాయంతో ముఠాను పట్టుకున్నారు. నలుగురు చిన్నారులను రక్షించి 11 మంది నిందితులను అరెస్టు చేశారు.
నిందితులు కోలాక కృష్ణవేణి, దీప్తి, గౌతం సావిత్రి దేవి, శ్రవణ్‌కుమార్, ఆమ్ గోత్ శారదా, సంపత్‌కుమార్‌గా గుర్తించారు. వీరి దగ్గరి నుంచి పిల్లల్ని కొనుగోలు చేసిన నాగ వెంకట పవన్ భగవాన్, రమా శ్రావణి, వినయ్ కుమార్, స్వాతి, రమేశ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 ఫోన్లు, రూ.5వేలు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
"వీళ్లంత సోషల్ మీడియా ద్వారా ఒక్కటై ఇలాంటి ఆక్రమాలు మొదలుపెట్టారు. అక్కడ పుట్టిన పిల్లలను అమ్మడానికి గుజరాత్ నుంచి తీసుకువచ్చి, తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. ఒక్క చిన్నారిని విక్రయించేందుకు సుమారు రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇద్దరు మహిళలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో దీన్ని నడిపిస్తున్నారు. పిల్లలను అమ్మే తల్లిదండ్రులకు తీసుకునే వారికి అసలు పరిచయం ఉండదు. ఇలా అక్రమంగా డబ్బులిచ్చి పిల్లలు కొంటున్నవారిని కూడా మేము నేరస్థులుగా పరిగణిస్తున్నాం. వారందరిపై చర్యలు తీసుకుంటాం" - సుధీర్ బాబు, రాచకొండ సీపీ