తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేను కూడా కేసీఆర్​ బాధితుడినే' - ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు సంచలన కామెంట్స్ - TELANGANA PHONE TAPPING CASE

SIB Ex Chief in Phone Tapping Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా స్పెషల్​ ఇంటెలిజెన్స్​ బ్రాంచ్​ మాజీ ఓఎస్డీ ప్రభాకర్​రావు తానూ కూడా కేసీఆర్​ బాధితుడినేనని సంచలన విషయం వెల్లడించారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసు నమోదైనప్పటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్​రావు ప్రధాన నిందితుడిగా మారిన తర్వాత తొలిసారి కోర్టుకి సమర్పించిన అఫిడవిట్​లో కీలక విషయాలు వెల్లడించారు. కేసులో ఏ6గా ఉన్న మీడియా సంస్థ యజమాని శ్రవణ్​రావు అదే తరహాలో కోర్టులో అఫిడవిట్​ను దాఖలు చేశారు.

Phone Tapping Case Update
Phone Tapping Case Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 7:20 AM IST

'నేను కూడా కేసీఆర్​ బాధితుడినే' - అంటూ ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు సంచలన కామెంట్స్ (ETV Bharat)

Telangana Phone Tapping Case Update : రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్​ఐబీ(SIB) మాజీ చీఫ్​ ప్రభాకర్​రావును అరెస్టు చేసేందుకు పోలీసులు వారెంట్​ జారీ చేయాలని నాంపల్లి కోర్టును కోరారు. ఈ క్రమంలో ఆయన న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అందులో కీలక విషయాలను తెలిపారు. మాజీ సీఎంది, తనది ఒకే కులం కావడం వల్లే ఎస్​ఐబీ చీఫ్​గా నియమించిన్నట్లు పోలీసులు చెబుతున్న దానిలో నిజం లేదన్నారు. తానూ కూడా కేసీఆర్​ బాధితుడినేనని స్పష్టం చేశారు.

అప్పట్లో విపక్ష నేతలకు మద్దతిస్తున్నట్లు బీఆర్​ఎస్​ జిల్లా నేతలు చెప్పగా అక్కడి నుంచి సీఐడీకి బదిలీ చేశారని మెమోలో ప్రభాకర్​రావు తెలిపారు. డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించేందుకు ఐదు నెలలు ఆలస్యం చేశారన్నారు. ఎస్​ఐబీలో ఎస్పీగా పదేళ్ల అనుభవం ఉండటం అప్పటి డీజీపీ సిఫార్సుతోనే ఎస్​ఐబీ అధిపతిగా నియమించారని వివరించారు. ఎస్​ఐబీ చీఫ్​గా అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్​ చీఫ్​ పర్యవేక్షణలోనే పని చేశానని, ప్రతి అంశాన్ని వారి నోటీస్​లో ఉంచినట్లు చెప్పారు. అక్కడ స్వతంత్రంగా పని చేసే అధికారం ఉండదన్నారు.

SIB Ex Chief Prabhakar Rao on KCR : 30 ఏళ్ల సర్వీసులో ప్రతిభతో 2012లో ప్రతిష్ఠాత్మక ఐపీఎం, 2016లో పీఎంజీ, 2019లో పీపీఎం, ఆసాధారణ్​ అసూచన కుశలత పదక్​ పురస్కారాలు లభించినట్లు వివరించారు. తనపై వారంట్​ జారీ చేయాలని కోర్టులో దర్యాప్తు సంస్థ దరఖాస్తు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్​లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నానని, ప్రస్తుతం అమెరికా ఇల్లినాయిస్​ పొంటియాక్​లో ఉన్నట్లు తెలిపారు. చికిత్స పూర్తయ్యాక తప్పనిసరిగా దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని చెప్పారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టివేయాలని కోరారు. ప్రభాకర్​రావు తరఫున న్యాయవాది సురేందర్​రావు కోర్టులో అఫిడవిట్​ను సమర్పించారు.

జూన్​ 26న అమెరికా నుంచి తిరిగి ప్రయాణం : నాలుకపై ట్యూమర్​ వల్ల 2004-10 మధ్య కాలంలో పలు సర్జరీలు చేసుకోవాల్సిన వచ్చిందనీ, అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తున్నట్లు వివరించారు. కొవిడ్​ ఇన్ఫెక్షన్​ తర్వాత 2023 మార్చిలో గొంతు, ఊపిరితిత్తుల్లో సమస్యలొచ్చాయని, ఉద్యోగ విరమణ చేశాక అమెరికా వెళ్లి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించి చికిత్స పొందాలనుకున్నానన్నారు. అందుకే అమెరికా పౌరుడైన బంధువు రంగినేని విజయ్​ ద్వారా నిపుణులైన వైద్యులని సంప్రదించినట్లు తెలిపారు. మింగడంలో అసౌకర్యం కలగడం సహా అలసట లక్షణాలు కనిపించడంతో భార్యతో పాటు అమెరికా వెళ్లేందుకు గత ఫిబ్రవరి 15న టికెట్లు బుక్​ చేసుకున్నట్లు చెప్పారు. జూన్​ 26న తిరిగి వచ్చేందుకు టికెట్​ బుక్​ చేసుకున్నట్లు ప్రభాకర్​రావు తెలిపారు.

రాజీనామా చేసిన మూడు నెలల తర్వాత అమెరికారాగా ఫోన్ ట్యాపింగ్​ గురించి అధికారులెవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. కేసు నమోదైన సంగతి తెలిశాక దర్యాప్తు అధికారి సహా ఉన్నతాధికారులను సంప్రదించినట్లు ప్రభాకర్​రావు వివరించారు. మార్చి 22,23న దర్యాప్తు అధికారి, 23న హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​, పశ్చిమ మండల డీసీపీని ఫోన్​లో సంప్రదించి దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు.

అమెరికాలో సంప్రదించాల్సిన నంబర్​, మెయిల్​ ఐడీలని కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు. దర్యాప్తు అధికారులెవరూ కేసు గురించి సంప్రదించలేదనీ కుమారుడు నిషాంత్​ రావు అమెరికా ప్రయాణ కారణాలపై దర్యాప్తు అధికారి అడిగిన సమాచారం అందించినట్లు చెప్పారు. సీఆర్​పీసీ 91 సెక్షన్​ కింద దర్యాప్తు అధికారి అడిగిన సమాచారాన్ని నిషాంత్​రావు అందించారని చికిత్స పూర్తయి ప్రయాణం చేయవచ్చని వైద్యులు సూచించిన వెంటనే స్వదేశానికి తిరిగి వస్తానని కోర్టుకు సమర్పించిన మెమోలో ప్రభాకర్​రావు పేర్కొన్నారు.

సీఆర్​పీసీ 73 మోపడం సరికాదు : మరోవైపు ఫోన్​ ట్యాపింగ్​ కేసు దర్యాప్తు సాగుతుండగా పోలీసులు సీఆర్​పీసీ 73 సెక్షన్​ మోపడం సరికాదని మీడియా సంస్థ అధినేత శ్రవణ్​ పేర్కొన్నారు. అరెస్టుకి అనుమతివ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. భారత్​కి తిరిగొచ్చేవరకు ఫోన్​లో అందుబాటులో ఉంటానని స్వదేశానికి వచ్చాక దర్యాప్తునకు సహకారం అందిస్తానని తెలిపారు. ట్యాపింగ్​ కేసులో తనకి ఎలాంటి పాత్ర లేదని చట్టవ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడలేదని శ్రవణ్​ తెలిపారు. చట్టానికి లోబడే హైదరాబాద్​లో 35 ఏళ్లుగా ఉంటూ వ్యాపారం ప్రారంభించినట్లు చెప్పారు. ముందస్తు ప్రకారం 15 మార్చి 2024న లండన్​ వెళ్లినట్లు వివరించారు.

ఆపరేషన్ 'పోల్​ 2023 - కేఎంఆర్' - ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరిన్ని కొత్త విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కీలక నిర్ణయం - ప్రభాకర్‌రావు అరెస్టుకు కోర్టులో పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details