New Ration Cards From Sankranti : అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. దీనికోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. వారంలోపే రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుందని సమాచారం. ఈలోగా తాజా మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారు. పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది.
కొత్త మార్గదర్శకాలు ఇలా : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షలుగా ఉంది. ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.10 నుంచి 20 వేల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. భూమి విషయంలో 3.5 ఎకరాల్లో పొలం, 7.5 ఎకరాల్లోపు మెట్ట భూమి అర్హతలుగా ఉన్నాయి.
కొత్త రేషన్ కార్డు కోసం లక్షల్లో అర్జీలు : తెలంగాణలో ప్రస్తుతం 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 2.82 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తుల్లో లబ్ధిదారుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్‌కార్డుల అప్లికేషన్లపై అంచనా వేశారు.
దాదాపు 10 లక్షల మేర దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 32 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లు అవుతుంది. రాష్ట్ర మొత్తం జనాభా 3.80 కోట్లు అని ఓ అధికారి తెలిపారు. కేబినెట్ మీటింగ్ అనంతరం కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలుపుతున్నాయి.
సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు - వచ్చే నెల 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ