KTR on Rythu Runa Mafi in Telangana :రైతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ అనుమానిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. రుణమాఫీ కాని రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తోందని మండిపడ్డారు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని, ఇచ్చేది పక్కన పెట్టి వాపస్‌పై దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్, ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ ఆప్షన్ అని వ్యాఖ్యానించారు.
రైతులకు మళ్లీ కష్టాలు :మాజీ సీఎం కేసీఆర్ రైతును రాజు చేస్తే, కాంగ్రెస్ నేతలు అనుమానిస్తూ వేధిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి జూటా మాటలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలని ధ్వజమెత్తారు. సెల్ఫీ దిగి తాను రైతు అని అన్నదాత నిరూపించుకోవాలా అని ప్రశ్నించారు. రుణమాఫీ చెయ్యలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురూ చేసిందని ఎద్దేవా చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రావడంతో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం :మరోవైపుబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్ధులంటే కాంగ్రెస్ సర్కారుకు ఎందుకింత చిన్నచూపని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఉపకార వేతనాలు, ఇతర అంశాలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా, బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడేదని అడిగారు. 5900 కోట్ల రూపాయలకు బకాయిలు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని, దరఖాస్తులకే దిక్కులేదని మండిపడ్డారు.