Former MD Of APSBCL Bail Petition in High Court :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూర్టీ హాలోగ్రామ్‌ల తయారీ, సరఫరా టెండర్ అప్పగింత కుంభకోణం కేసులో ముందస్తు బెయిలు కోసం ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారాణాలతో తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. తనను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తే నేరం ఒప్పుకోవాలని ఒత్తిడిచేస్తారన్నారు. చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉందన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానన్నారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై మంగళగిరి సీఐడీ పోలీసులు ఈ ఏడాది నవంబర్ 23న నమోదు చేసిన విషయం తెలిసిందే.
అర్హత లేకపోయినా అప్పగింత : మద్యం సీసాలపై ముద్రించే సెక్యూర్టీ హాలోగ్రామ్‌ల తయారీ, సరఫరా టెండర్‌ను కట్టబెట్టే వ్యవహారంలో ఏపీఎస్‌బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ చెన్నైకు చెందిన సీనియర్ పాత్రికేయుడు వి.శివరామన్ ఈ ఏడాది నవంబర్ 23న సీఐడీకి ఫిర్యాదు చేశారు. "అర్హత లేకపోయినా కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థ, హోలిస్టిక్ ఇండియా, అల్ఫా లేజర్ టెక్ సంస్థలను టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ మూడు సంస్థల్లో రెండు అప్పటికే బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాయి. అంతిమంగా కుంభత్ హాలోగ్రాఫిక్ సంస్థకు టెండర్ కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో వాసుదేవరెడ్డికి భారీగా సొమ్ము ముట్టింది. ఆర్‌ఎఫ్‌పీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)కి విరుద్ధంగా హాలోగ్రామ్‌లను కుంభత్ సంస్థ చెన్నై నుంచి తయారు చేసి సరఫరా చేసింది.