Former CM YS Jagan Petition in AP High Court For Opposition Leader : ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 'పట్టు వదలని విక్రమార్కుడిలా' పోరాటం చేస్తున్నారు. గతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని, లేఖ రాసినా ఇవ్వలేదని జగన్ పిటిషన్‍లో పేర్కొన్నారు.
జగన్ శాసనసభ చింతకాయల అయ్యన్న పాత్రుడుకి జూన్ 25న లేఖ రాశారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో తెలిపారు.
ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి :విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. పార్లమెంటులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధన పాటించలేదన్నారు.
అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు.